YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీ ఎన్నికలకు సర్వ సన్నద్ధం

పంచాయితీ  ఎన్నికలకు సర్వ సన్నద్ధం
పల్లె పోరుకు గడువు సమీపిస్తోంది..  ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న పోలింగ్‌ డబ్బాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించినవి కలుపుకొని 2433 పోలింగ్‌ డబ్బాలను సిద్ధం చేశారు. మరోవైపు సర్పంచి అభ్యర్థికి పింక్‌, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలను ముద్రించడానికి జిల్లాలో నాలుగు ముద్రణాలయాను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు.వచ్చే నెల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పలుమార్లు గడువులోగానే పంచాయతీల ఎన్నికలను పూర్తి చేస్తామని ప్రకటించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి జిల్లా అధికారులు సమాయత్తం అవుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా నుంచి గ్రామీణ ఓటర్లను విడదీసి, గ్రామాల్లో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రచురణ, మార్పులు, చేర్పుల తర్వాత జిల్లాలో మొత్తం 4,19,065 మంది ఓటర్లున్నట్లు లెక్క తేల్చారు. దీంట్లో పురుషులు 2,11,026 మంది కాగా స్త్రీలు 2,08,025 మంది, ఇతరులు(ట్రాన్స్‌జెండర్స్‌) మరో 14 మంది ఉన్నారు. బీసీ ఓటర్లను సైతం గుర్తించడం దాదాపు కొలిక్కి వచ్చినట్లే.. అధికారుల లెక్కల ప్రకారం 1,30,783 మంది పురుషుల బీసీ ఓటర్లుండగా, 1,28,797 మంది స్త్రీలు, ఇతరులు ఇద్దరున్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 2,59,582 మంది బీసీ ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్యను అధికారికంగా నేడు, రేపో ప్రకటించే అవకాశం ఉంది జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లోంచి కరీంనగర్‌ కార్పొరేషన్లో విలీన పంచాయతీలు, కొత్తగా నగర పంచాయతీలుగా మారుతున్న కొత్తపల్లి, చొప్పదండి పంచాయతీలను తీసివేయగా 313 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ పంచాయతీల పరిధిలో 2,966 వార్డులున్నట్లు గుర్తించారు. వార్డుల వారీగా  పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పుల తర్వాత జరిగే ఈ సంవత్సరం ఎన్నికలు ప్రత్యేకంగా నిలువనున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రిజర్వేషన్‌ విధానం రెండు పర్యాయాలకు వర్తించేలా మార్పులు చేశారు. పంచాయతీ పాలకవర్గం బాధ్యతలను మరింత పెంచేలా చట్టంలో మార్పులు చేశారు. విధిగా గ్రామ సభల నిర్వాహణ, హరితహారం కార్యక్రమం కోసం తప్పనిసరిగా గ్రామంలో నర్సరీల ఏర్పాట్లు, నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం దక్కేలా చర్యలు తీసుకోవడం లాంటి తదితర బాధ్యతలను అప్పజెప్పనున్నారు. అంతేగాకుంగా గతంలో సర్పంచ్‌ ఒకరికే ఉన్న చెక్‌ పవర్‌ను ఇకనుంచి ఉప సర్పంచ్‌తో పంచుకోవాల్సి ఉంటోంది. దీంతో వార్డు సభ్యులందరు కలిసి ఎన్నుకునే ఉప సర్పంచ్‌ పోటీ సైతం రసవత్తరంగానే మారబోతుంది.

Related Posts