హైదరాబాద్, ఆగస్టు3,
తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో అక్టోబరులో గ్రూప్-1 పరీక్షలు, డిసెంబరులో గ్రూప్-2 పరీక్ష, నవంబరులో గ్రూప్-3 పరీక్ష నిర్వహించనున్నారు.
వివిధ పరీక్షల తేదీలు ఇలా..
➥ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు
➥ ట్రాన్స్‌కోలోని ఉద్యోగాల భర్తీకి అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ రాష్ట్రప్రభుత్వ విభాగాల్లో వివిద గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్‌లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
➥అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడనుంది. మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ వచ్చే ఏడాది జులైలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
➥ పోలీసు శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 2025, ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నియామక పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నారు.
➥ డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు 2025, జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
➥గ్రూప్-2 నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది మేలో మరోసారి విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
➥గ్రూప్-3 నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది. నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
➥సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి 2025, జులైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.