YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూసీ నది చెంగిచియాన్ గా మారేనా?

మూసీ నది చెంగిచియాన్ గా మారేనా?

హైదరాబాద్, అక్టోబరు 24,
తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ముచుకుందా నదికి తిరిగి ప్రాణం పోయాలని కంకణం కట్టుకుంది. మురికి కూపంగా ఉన్న మూసీని ఎలా ప్రక్షాలన చేయాలనే అంశంపై అధ్యయనం మొదలు పెట్టింది. అందులో భాగంగానే తెలంగాణ మంత్రులు, అధికారులు సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆదేశ రాజధాని సియోల్ లో ఉన్న చెంగిచియాన్ నదిని పరిశీలించారు. ఒకప్పుడు మురికి మయంగా ఉన్న ఆ నదిని, అక్కడ ప్రభుత్వం ఎన్నో అవాంతరాలు వచ్చినా, సమర్థవంతంగా పరిష్కరిస్తూ, మంచి నీటి నదిగా మార్చింది. కాలుష్య కాసారంగా ఉన్న చెంగిచియాన్ ఇప్పుడు ఎలా మారింది? సియోల్ నగరం ప్రపంచంలో 7వ స్థానానికి చేరుకోవడంలో ఈ నది ఎలాంటి పాత్ర పోషించింది? సౌత్ కొరియాకు ఆర్థిక వ్యవస్థకు ఎలా ఊతమై నిలిచింది?దక్షిణ కొరియాలో రెండో అతిపెద్ద నది చెంగిచియాన్. మొత్తం 512 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నది. సియోల్ మెట్రో పరిధిలోనే 50 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. చెంగిచియాన్ నదికి, మన మూవీ నదికి దగ్గరి సారూప్యత ఉంది. 1910 వరకు చెంగిచియాన్ సహజ నదిగా కొనసాగింది. ఆ తర్వాత పట్టణీకరణ విపరీతంగా పెరిగింది. 1953లో కొరియా యుద్ధం తర్వాత, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం సియోల్‌కు వలస వచ్చారు. వారంతా చెంగిచియాన్ వెంట తాత్కాలిక గృహాలను నిర్మించుకున్నారు. అక్కడే స్థిరపడ్డారు. సియోల్ నగరం  నెమ్మదిగా విస్తరించింది. సహజ నీటి వనరులు తగ్గిపోయాయి. మంచి నీటి నది నెమ్మదికి మురికి మయంగా మారింది. కొంతకాలం తర్వాత చెంగిచియాన్  ప్రవాహమే మాయం అయ్యింది.1958 తర్వాత అక్కడి ప్రభుత్వం సియోల్ లో అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద మొత్తంలో చేపట్టింది. 20 సంవత్సరాల తర్వాత డౌన్‌టౌన్, కొత్త సిటీల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఎలివేటెడ్ హైవేని నిర్మించింది. అదే సమయంలో పర్యావరణ అనుకూల నగరాన్నినిర్మించాలని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కనుమరుగైన చెంగిచియాన్ నదికి ప్రాణం పోయాలని తీర్మానించింది. ఆ దిశగా కీలక ప్రణాళికలు సిద్ధం చేసింది.చెంగిచియాన్ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టిన తొలి రోజుల్లో తీవ్ర ప్రతిఘటనలు ఎదురయ్యింది. నదీ విస్తరణలో వందలాది దుకాణాలు, వేలాది ఇళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. స్థానిక దుకాణదారులు, ఇళ్లు నిర్మించుకున్న వారిని నుంచి నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చెంగిచియాన్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. బాధితులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. దుకాణాలు కోల్పోయే వారికి, ఇళ్లు కూలిపోయే వారిని మరో చోటుకు తరలించింది. వారికి ఆర్థికంగా సాయం అందించింది. ఉపాధి కల్పించింది. నది పునరుజ్జీవనం తర్వాత వారికి నదీ పరిసరాల్లో దుకాణాల కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఆందోళనకారులు శాంతించారు. నది ప్రక్షాళనకు ఒప్పుకున్నారు.2002 నుంచి  చెంగిచియాన్ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. నగరంలో నాలుగు చోట్ల మురికి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలు పెట్టారు. దశాబ్ద కాలంలో చెంగిచియాన్ మంచి నీటి నదిగా మారిపోయింది. నదికి ఇరు వైపులా షాంపింగ్ కాంప్లెక్సులు, రెస్టారెంట్లు, ఆకాశహార్మ్యాలు ఏర్పడ్డాయి. చెంగిచియాన్ మీద నిర్మించిన వంతెనలు ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.  నగర వాసులకు ఎటు చూసినా కనువిందే!  స్థానికులే కాదు, ప్రతి రోజు 50 వేల మంది విదేశీ పర్యాటకులు చెంగిచియాన్ నదిని సందర్శిస్తున్నారు. ప్రపంచంలోని గ్లోబల్ సిటీల్లో సియోల్ 7వ స్థానాన్ని సంపాదించింది.  సౌత్ కొరియాకు సియోల్ అర్థిక చోదక శక్తిగా అవతరించింది.మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపధ్యంలో చెంగిచియాన్ నదిలాగే పునరుజ్జీవం చేసే అవకాశం ఉంది. ముచుకుందా చారిత్రక విలువలను పునరుద్దరించి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం సాధ్యం కాని పని కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి మురికి మూసీని మురిపించవచ్చు. మూసీని సియోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తే, హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావచ్చు. కావాల్సిందల్లా పాలకులలో చిత్తశుద్ధి, విపక్షాల సహకారం మాత్రమే.

Related Posts