హైదరాబాద్, నవంబర్ 30,
రాష్ట్ర బీజేపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తుంది.. తెలంగాణలో ప్రత్యామ్నాయం తామే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ నేతలు ప్రకటనలు ఇస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం చేపట్టేది మేమే అంటూ బీజేపీ నేతలిస్తున్న స్టెట్ మెంట్లు గ్లోబల్ ప్రచారంలా ఉన్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్లోనే కాదు, ఆపార్టీ సానుభూతిపరుల్లోనూ జరుగుతుండటం గమనార్హం. అందుకు గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మిషన్ 90 లక్ష్యంగా, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ తెలంగాణలో 8 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇక దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో చార్ సౌలక్ష్యంతో, మోడీ ఫిర్ ఎక్ బర్ నినాదంతో హడావుడి చేసిన బీజేపీ కేవలం 240 కే పరిమితం కావాల్సి వచ్చింది. తెలంగాణలోనూ డబుల్ డిజిట్ పార్లమెంట్ స్థానాలు సాధిస్తామని చెప్పుకున్న కాషాయ నేతలు 8 స్థానాలే దక్కించుకోగలిగారు. అలా అనుకున్న లక్ష్యాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయినప్పటికి ఆ పార్టీ నేతలు నేటికి అదే స్లోగన్స్, అవే గ్లోబల్ ప్రచారం, అదే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండటం చర్చనీయంశంగా మారుతోంది.ఎన్నికల వైఫల్యాలు అటుంచుతే, గత ఎన్నికలే రాష్ట్ర బీజేపీలో కొత్త కుంపట్లను రగిలించాయి. కొత్త, పాత నేతల పంచాయితీ పీక్ స్టేజ్ కి చేరి, కీలక నేతలు పార్టీకి దూరమవడానికి కారణమయ్యిందనే టాక్ వుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం తామే అని హడావుడి చేసిన కాషాయపార్టీ ఎప్పటికప్పుడు బొక్క బోర్లా పడుతూనే ఉంది. ఇప్పటికే కొత్త, పాత నేతల పంచాయితి రాష్ట్ర బీజేపీలో సైలెంట్ గా ముదురుతుంది. ఇక గత ఎన్నికల్లో ఊహించని వారంతా విజయం సాధించారుగెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసినవారంతా ఓటమి పాలయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ మినాహిస్తే అంతా కొత్త ముఖాలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రాజాసింగ్ మినాహాయిస్తే ఏలేటితో సహా మిగితా ఏడుగురు పార్టీకి సంబంధం లేని కొత్త వారే. ఇక పార్లమెంట్ సభ్యుల పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది.గెలిచిన ఎనిమంది ఎంపీల్లో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను మినహాయిస్తే అందరూ పార్టీకి కొత్తవారే. అలా గెలిచిన వారిని కూడా రాష్ట్ర నాయకత్వం నిలబట్టుకుంటుందా? లేదా ? అనే అంశం చర్చల్లో నలుగుతుంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో రాష్ట్ర నాయకత్వం వ్యవహారిస్తున్న తీరే ఆ అనుమామానాలకు తావిస్తుందంటున్నారు.కొత్త నేతలెవరైనా పార్టీలోకి వస్తే అంత తొందరగా జీర్ణించుకోలేని మనస్తత్వం పాతనేతల్లో బలంగా కనిపిస్తుంది. పాత నేతల వైఖరి కారణంగానే బీజేపీలో చేరిన కీలక నేతలంతా పార్టీకి దూరమయ్యారన్న అభిప్రాయం ఉంది. ఇక గెలిచిన ఎమ్మెల్లేలను, ఎంపీలను సరిగ్గా చూసుకుంటారాంటే అదీ లేదు. వారిని డీల్ చేసే విషయంలో రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరు విమర్శలపాలవుతుంది. కనీసం ఇప్పటి వరకు ప్లోర్ లీడర్ కు పార్టీ ఆఫీసులో ఛాంబర్ కేటాయించ లేదు.ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. ఆ క్రమంలో కొత్త, పాత నేతల పంచాయితీలతో నేతలతో పాటు క్యాడర్‌లో కూడా గందరగోళం నెలకొంటుంది. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా పార్టీలోకి కొత్తగా వచ్చిన ఏలేటిని ఎలా నియమిస్తారని పార్టీలోని పాత నేతలు ఇప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. ఏలేటి కూడా అందర్నీ సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతుండటంతో.. ఎనిమిది మంది ఎమ్మెల్లేలు ఎనిమిది దిక్కులన్నట్టు వ్యవహారం నడుస్తోంది.అటు కొత్త పాత నేతల పంచాయితీ, ఇటు ఎంపీలు, ఎమ్మెల్లేలు వర్సెస్ రాష్ట్ర నాయకత్వం మధ్య గ్యాప్. మరోవైపు ఎమ్మెల్లేలు వర్సెస్ ఎమ్మెల్లేలు, ఇంకోవైపు అధ్యక్ష కుర్చీ పీకులాట వంటి తగాదాలు రాష్ట్ర బీజేపీని అధోగతి పాలు చేస్తున్నాయని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇతర పార్టీల కీలక నేతలంతా కాంగ్రేస్ వైపు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ నుంచి సైతం కీలక నేతలు పార్టీ వీడుతున్నారనే సంకేతాలు ఏమైనా ఉన్నాయా..? ఆ సంకేతాలు అధిష్టానానికి అందాయా? అందుకే బీజేపీ ఎమ్మెల్యేలలు, ఎంపీలకు బ్రెయిన్ వాష్ చేసేందుకే మోడీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.