YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మొగుడ్ని చంపి... ఆత్మహత్యగా చిత్రీకరించి...

మొగుడ్ని చంపి... ఆత్మహత్యగా చిత్రీకరించి...

మహబూబ్ నగర్, నవంబర్ 30,
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి తూడుకుర్తిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసి కాలువలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య.. చివరకు పోలీసులు ఎంటర్ అవ్వడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ (35) బిజినపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2011లో గద్వాల్ కు చెందిన కీర్తి ని ప్రేమ వివాహం చేసుకొని నాగర్ కర్నూల్‌లో నివాసం ఉంటున్నారు. తన భార్య కీర్తి SBM అనే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో పనిచేస్తోంది. అక్కడే బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త వారి మధ్య ప్రేమ, వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన భర్త… భార్యను గట్టిగా మందలించాడు. దీంతో అసలు విషయం ఇంట్లో తెలిసిందని.. దీంతో ప్రియుడు దూరమవుతున్నాడని భావించి.. ఏకంగా భర్త అడ్డును తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం బిజినపల్లి మండల కేంద్రంలో ప్రియుడితోపాటు మరో వ్యక్తితో కలిసి భర్తపై దాడి చేయించింది. ఈ సారి ప్రియుడిని వదిలించుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని భర్త గట్టిగా హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని దారుణానికి తెగించింది. భర్త జగదీష్‌ను దైవ దర్శనం పేరుతో గద్వాల్ లోని తన తల్లిగారి ఇంటికి తీసుకెళ్ళింది భార్య కీర్తి. అక్కడ నాగరాజు తీసుకువచ్చిన మత్తు మందు కలిపిన కల్లును జగదీష్ తో తాగించారు. జగదీష్ స్పృహ కోల్పోయిన తర్వాత కారులో తూడుకుర్తి గ్రామ శివారులోని జగదీష్ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. మొదట అక్కడే కరెంట్ షాక్ తో చంపాలని భావించారు. సమయానికి కరెంట్ లేకపోవడంతో ప్లాన్ మార్చారు. KLI కాల్వలో తోసేశారు.. అంతటితో ఆగకుండా జగదీష్ ను నీళ్లలో ముంచి దారుణంగా హతమార్చారు. ఇక మరునాడు తన భర్త కనిపించడం లేదంటూ ఏమి ఎరుగనట్లు నటించింది భార్య కీర్తి. రెండు రోజుల తర్వాత బిజినపల్లి మండలం ఆల్లిపూర్ గ్రామ శివారులో కాలువలో భర్త జగదీష్ మృతదేహం లభించింది. ఈ విషయంలో మృతిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భార్యని అదుపులో తీసుకొని విచారించగా అసలు గుట్టు రట్టయింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణం అంటూ పోలీసులు తేల్చారు. మృతుడి భార్య కీర్తి, అత్త, బావమరిది, నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించి.. ఆరుగురిని అరెస్టు చేశారు. మత్తుమందు అందించిన వ్యక్తి మోహన్ గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది..

Related Posts