
గుంటూరు, మే 21,
దివంగత మాజీ మంత్రి... నవ్యాంధ్రప్రదేశ్ తొలిస్పీకర్ కోడెల శివప్రసాద్ మరణించినా రాజకీయంగా ఆయన సమైక్యాంధ్రప్రదేశ్‌లోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబ రాజకీయ ప్రస్థానంతో ఆయనతోనే దాదాపు ముగిసిపోయినట్టుగానే కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ ఓడిపోయారు. ఆయన మరణాంతరం ఆయన వారసుడు శివరాం సత్తెనపల్లి ఇన్‌చార్జ్ పగ్గాల కోసం చేయని ప్రయ్నతం అంటూ లేదు. శివరాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు సత్తెనపల్లి ఇన్‌చార్జ్ పగ్గాలు నాన్చుతూ వచ్చి ఎన్నికల గత ఏడాది బీజేపీ నుంచి పసుపు కుండువా కప్పుకున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చారు. శివరాం గగ్గోలు పెట్టినా చంద్రబాబు, చినబాబు లోకేష్ ఇద్దరూ లైట్ తీసేుకున్నారు. అటు నరసారావుపేట వైపు కన్నేద్దామనుకుంటే అక్కడ బీసీ కోటాలో అరవిందబాబు కాచుకుని ఉన్నారు. అప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమ్మ కోటాలో నేతలు లెక్కకు మిక్కిలిగా నియోజకవర్గాలు ఆక్రమించేసుకుని ఉన్నారు. వీరి మధ్యలో కోడెల శివరాం గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆలపాటి రాజా లాంటి నేతకే సీటు లేదు. అటు కొమ్మలపాటి కూడా సీటు త్యాగం చేశారు. అయితే వీరికి ఏదోలా న్యాయం జరిగినట్టే. ఆలపాటిని ఎమ్మెల్సీని చేసేశారు. కొమ్మలపాటి పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. రేపోమాపో చంద్రబాబు బహిరంగ హామీ మేరకు ఆయన కూడా ఎమ్మెల్సీ అవుతారు. ఇప్పటికే ఉన్న ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు.. కమ్మ ఎమ్మెల్సీలకు తోడు కొత్తగా నామినేటెడ్ పదవులు వచ్చిన రాయపాటి శైలజ అటు ఒక కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రిగా జిల్లాలో కోటాలో నారా లోకేష్ ఉండగా.. ఎంత కోడెల కొడుకు అయినా... కమ్మ అయినా శివరాంను ఎవరు ? పట్టించుకుంటారు ? ఎందుకు దగ్గరకు తీసుకుంటారు ? శివరాం వల్ల పార్టీకి ఎంత మైలేజ్ అన్న లెక్కలేసుకోకుండా చంద్రబాబు, లోకేష్ ఉంటారా ? ఖచ్చితంగా ఆ లెక్క తీస్తే ఆన్సర్ ఏంటో ఆ తండ్రి కొడుకులకే బాగా తెలుసు. కోడెల వారసుడు అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ గా ఆడడానికి శివరాంకు గ్రౌండ్ అంటూ లేదు. సత్తెనపల్లిలో కన్నా కాచుకుని ఉన్నారు. ఆయన తర్వాత ఆయన వారసులు అక్కడ బలంగా పాతుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కన్నాను కాదనుకున్నా చాలా మంది టీడీపీ కీలక నేతల కన్ను సత్తెనపల్లిమీదే ఉంది. నరసారావుపేట జనాలు కోడెల ఫ్యామిలీని ఎప్పుడో 2004 ఎన్నికల్లోనూ కాదనుకున్నారు. పైగా మొన్న కూటమి వేవ్‌లో బీసీ కోటాలో అరవింద బాబు నెగ్గారే తప్పా.. అక్కడ టీడీపీ పట్టుకోసమే ఆపసోపాలు పడుతోంది. మొన్న వచ్చిన గెలుపుకూడా ఇరవై ఏళ్ల తర్వాత వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఏడాది అవుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మహామహులైన వారికి చంద్రబాబు హామీలు ఇచ్చిన వారికి పదవులు వస్తాయా ? రావా ? అన్న సస్పెన్స్ ఉంది. శివరాం నిన్నమొన్నటి వరకు అధిష్టానాన్ని కలవడానికే ఇబ్బందులు పడ్డారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో శివరాంకు ప్రభుత్వ పరంగా ఏ నామినేటెడ్ పదవి అయినా వస్తుందా ? అంటే ఆన్సర్ కష్టమే అని చెప్పాలి. ఏదేమైనా శివరాం 2029 పొలిటికల్ ఆశలు కూడా కనుచూపుమేరలో కనపడడం లేదు.