
జకర్తా, జూన్ 6,
సహజీవనమే ఇప్పటి ప్రపంచంలో కామన్ అయిపోతోంది. అలాంటిది పెళ్లి నిశ్చమయ్యాక శృంగారం చేస్తే శిక్షలు వేస్తారా ?. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వేస్తారు. ఈ ఇండొనేషియా జంట శిక్షలు అుభవించింది కూడా. ఇండోనేషియాలోని అసెహ్ ప్రావిన్స్‌లో ఒక జంట వివాహానికి ముందు లైంగిక సంబంధం కలిగి ఉన్నందుకు షరియా చట్టం కింద ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బల శిక్షను బహిరంగంగా అమలు చేశారు. అసెహ్ ఇండోనేషియాలో షరియా చట్టాన్ని అమలు చేసే ఏకైక ప్రాంతం. ఇక్కడ వివాహేతర సంబంధాలు, స్వలింగ సంబంధాలు, మద్యం సేవనం, జూదం వంటి నేరాలకు బహిరంగ కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు. బాండా అసెహ్‌లోని ఒక బహిరంగ పార్క్‌లో ఈ జంట ఒక్కొక్కరూ 100 కొరడా దెబ్బల శిక్షను అనుభవించారు. పురుషుడికి శిక్షను రాటన్ కర్రతో అమలు చేశారు. మహిళా నిందితురాలిని ఒక మహిళా షరియా పోలీసు అధికారి కొరడాతో కొట్టింది. ఈ శిక్షను స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది పర్యవేక్షించారు . జనం సమక్షంలో ఈ శిక్ష అమలు చేశారు. వీరితో పాటు మద్యం సేవనం, ఆన్‌లైన్ జూదం సంబంధిత నేరాలకు మరో ముగ్గురు వ్యక్తులు మొత్తం 49 కొరడా దెబ్బల శిక్షను అనుభవించారు. అసెహ్ ఇండోనేషియాలో 2001లో కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక ఒప్పందం ద్వారా ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని పొందింది. దీర్ఘకాల సెపరటిస్ట్ తిరుగుబాటును అణచివేయడానికి. 2015లో, అసెహ్‌లో షరియా చట్టాన్ని ఒక శాతం జనాభా ఉండే గైర్-ముస్లిములకు కూడా వర్తింప చేశారు. ఇది వివాహేతర సంబంధాలు, స్వలింగ సంబంధాలు, జూదం, మద్యం సేవనం, మహిళలు గట్టి దుస్తులు ధరించడం, పురుషులు శుక్రవారం ప్రార్థనలు చేయకపోవడం వంటి నేరాలకు 100 కొరడా దెబ్బల వరకు శిక్షలను అనుమతిస్తుంది. ఈ బహిరంగ కొరడా శిక్షలు మానవ హక్కుల సంస్థల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఈ శిక్షను అవమానకరమైనది , అమానవీయమైనదిగా ప్రకటించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఈ శిక్షలు ఇండోనేషియా సంతకం చేసిన అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను ఉల్లంఘిస్తాయని వాదించాయి. అయితే అసెహ్ జనాభాలో ఈ శిక్షలకు గణనీయమైన మద్దతు ఉంది. మత ఉల్లంఘనలను నిరోధించడానికి ఒక సాంప్రదాయక మార్గంగా ప్రజలు నమ్ముతూంటారు. ఇండోనేషియా జాతీయ క్రిమినల్ కోడ్ వివాహేతర సంబంధాలను నియంత్రించదు, కానీ 2022లో ఆమోదించిన కొత్త క్రిమినల్ కోడ్ 2026 నుండి వివాహేతర శృంగారాన్ని నేరంగా పరిగణిస్తుంది. అయితే, అసెహ్‌లో షరియా చట్టం ఈ నేరాలను ఇప్పటికే నిషేధించి శిక్షలు అమలు చేస్తోంది.