YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డబ్బులతో ఛైర్మన్ పరార్...

డబ్బులతో ఛైర్మన్ పరార్...

అదిలాబాద్, జూన్ 23, 
అది తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల.. ఆ ప్రాంతంలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిభ జూనియర్ కాలేజీ ని నిర్వహిస్తున్నాడు. మొదట్లో ఈ కాలేజీలో చదివిన విద్యార్థులకు మంచిర్యాంకులు రావడంతో.. గుర్తింపు సంపాదించుకుంది. అప్పటిదాకా మంచివాడిగా.. కాలేజీ చైర్మన్ గా కనిపించిన మహేందర్ రెడ్డి.. ఒక్కసారిగా తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. కాలేజీ పేరు చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వాటిని ఇవ్వకుండా అలానే కాలయాపన చేశాడు. వచ్చిన డబ్బులను ఇతర మార్గాల్లో పెట్టుబడిగా పెట్టాడు. అవి కాస్త వచ్చే మార్గం లేకపోవడం.. అప్పులు తెచ్చిన దగ్గర ఒత్తిడి పెరిగిపోవడంతో మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు. రాత్రికి రాత్రే జెండా ఎత్తేశాడు.అప్పులు ఇచ్చిన వారికి డబ్బులు చెల్లించకుండా.. తన కాలేజీని మధ్యవర్తుల సహాయంతో అమ్మాలని మహేందర్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లను మధ్యవర్తుల ద్వారానే అందించాలని భావించినట్టు సమాచారం. అందువల్లే అతడు కొంతమంది మధ్యవర్తులను నియమించుకొని ఈ తతంగాన్ని చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న అప్పులు ఇచ్చినవారు ఆందోళనకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మహేందర్ రెడ్డి నిర్వాకం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బులు అడుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయం కాస్త పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్నారు. మహేందర్ రెడ్డి ఆచూకీ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో పెట్టాల్సిన చైర్మన్ ఇలా దారి తప్పడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యను వ్యాపారంగా మార్చేసి.. అడ్డగోలుగా అప్పులు తెచ్చి.. చివరికి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న మహేందర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.. మహేందర్ రెడ్డి తొలి రోజుల్లో కాలేజీ నిర్వహణ సక్రమంగానే చేపట్టారని.. ఆ తర్వాతే డబ్బు మీద మోజుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పులు తెచ్చి.. వాటిని ఇతర మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టారని.. అవి తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో కాలేజీని మొత్తం ఎత్తివేసారని.. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు మహేందర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాలేజీ భవనం విక్రయించి అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు చెల్లించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు

Related Posts