
విజయవాడ, జూన్ 23,
కూటమి ప్రభుత్వంలో నారా లోకేశ్ నిదానంగా కీలకంగా మారుతున్నారు. లోకేశ్ ను కేవలం మంత్రిపదవిలో చూడటానికి వీలులేదు. క్రమేపీ లోకేశ్ తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుని దాటేసేందుకు ప్రయత్నాలు ఎప్పుడో ప్రారంభించినా ఇప్పుడిప్పుడే సఫలమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. లోకేశ్ 2014 ఎన్నికలకు ముందు వరకూ బ్యాక్ ఎండ్ లో పార్టీలో పనిచేసినా ఎవరికీ పెద్దగా ఆయనపై ఒక అభిప్రాయం లేదు. కానీ 2014 ఎన్నికల్లో మంత్రి అయిన నాటి నుంచి పార్టీపై పట్టు సంపాదించుకున్నారు. నేతలను పక్కన పెట్టారు. కేవలం కార్యకర్తలనే దగ్గరకు తీసుకునే నేతగా నారా లోకేశ్ పేరు సంపాదించుకున్నారు. నారా లోకేశ్ కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో చంద్రబాబు కంటే ముందున్నారన్న మాట ప్రతినోటా పార్టీలో వినపడుతుంది.. అర్హత ఉన్నోళ్లు టెన్షన్ పడక్కకర్లేదు. కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేశ్ తీసుకు వచ్చిన బీమా పథకాలు కానీ, కార్యకర్తలకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించే తీరు కానీ, కార్యకర్తల వెన్నంటే ఉంటాననే బలమైన సంకేతాలు పంపడం వల్ల కానీ ఇప్పుడు పసుపు పార్టీ కార్యకర్తల నరనరాల్లో నారా లోకేశ్ నామస్మరణ మాత్రమే వినపడుతుంది. చెప్పాలంటే క్యాడర్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు లోకేశ్ కంటే కొంత వెనకబడి ఉన్నారనే అనుకోవాలి. లోకేశ్ మాట పార్టీలో చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం మరింత బలపడటంతో ఇప్పుడు లీడర్లు కూడా లోకేశ్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. ఇది పార్టీ పరంగా మాత్రమే. ఇక చంద్రబాబు కున్న రాజకీయ అనుభవం రాకపోయినా ఆయన వెంట నడుస్తూ వ్యూహాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ..
ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరంటే ఎవరైనా ఠక్కున నారా లోకేశ్ పేరు మాత్రమే చెబుతారు. పవన్ కల్యాణ్ నెంబర్ 3 అనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నారాలోకేశ్ పవన్ కల్యాణ్ కు సంబంధించిన శాఖల్లో వేలు పెట్టరు కానీ, మిగిలిన అన్ని శాఖల విషయంలో మాత్రం లోకేశ్ ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. పాలనలో తన పట్టు నిరూపించుకోవడం కోసం లోకేశ్ టీం మన మిత్ర యాప్ ను తేవడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తుంది. దాదాపు 150 రకాల సేవలు మన మిత్ర ద్వారా కేవలం వాట్సప్ ద్వారా పరిష్కరించడంలో లోకేశ్ టీం సక్సెస్ అయింది. ఇక తల్లికి వందనం నిధులు విడుదల చేయించి తన శాఖలోనూ తనకు తిరుగులేదని లోకేశ్ నిరూపించుకున్నారు. ఢిల్లీ లో పర్యటిస్తూ... చంద్రబాబు కూడా నారా లోకేశ్ కు మరింతగా పొలిటికల్ గ్రిప్ సంపాదించుకునేందుకు తరచూ ఢిల్లీ పర్యటనలకు పంపుతున్నారు.
గతంలో చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై తరచూ ఢిల్లీ వెళ్లేవారు. కానీ ఈ మధ్య కాలంలో నారా లోకేశ్ తరచూ ఢిల్లీ వెళుతుండటం కూడా తన తర్వాత లోకేశ్ అని ఢిల్లీ పెద్దలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఢిల్లీకి వెళ్లిన నారా లోకేశ్ రెండు రోజుల పర్యటించి వివిధ కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసి వచ్చారు. దీనికితోడు కాగ్నిజెంట్ ప్రతినిధులతో సమావేశమై విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ సయితం ప్రస్తుతం చంద్రబాబు, పవన్ పేర్లతో పాటు లోకేశ్ పేరు కూడా చెప్పడం, విమానాశ్రయంలో లోకేశ్ ను దగ్గరకు తీసుకోవడం చూస్తుంటే లోకేశ్ కు అధికార ముద్ర కూడా పడిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.