YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రభుత్వ పుస్తకాలు పక్కదారి..

 ప్రభుత్వ పుస్తకాలు పక్కదారి..
పుస్తకాల మార్కెట్‌కు విజయవాడ ప్రసిద్ధి. స్థానికంగా వన్‌టౌన్‌ మార్కెట్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు విక్రయమవుతున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఈ పుస్తకాలు ఇంకా రాలేదని చెప్పటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలకు అవసరం మేరకు పుస్తకాలు ముద్రించి పంపితే ప్రస్తుతం పుస్తకాల కొరత ఉండేది కాదని ఉపాధ్యాయ వర్గం అంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలను ముద్రించేది ప్రభుత్వం ఎంపిక చేసిన ముద్రణకర్తలే. చాలా మంది ముద్రణకర్తలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని తొలుత ముద్రించిన పుస్తకాలను మార్కెట్లో పుస్తక విక్రేతలకు తరలించటంతో ప్రస్తుతం పుస్తకాల ఏర్పడింది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు సమకూరాయి. కానీ సర్కారీ విద్యార్థులకు ఇప్పటికీ పుస్తకాలు చేరలేదు. పుస్తకాలు మొత్తం సమకూరలేదని ఉపాధ్యాయులు ఉన్న వాటిని గోదాముల్లోనే ఉంచి పంపిణీ చేయటం లేదు. ప్రైవేటు మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా పుస్తకాలు లభిస్తుంటే సర్కారీ పాఠశాలల విద్యార్థులకు ఎందుకు పుస్తకాలు లభించటం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా తమ వద్దకే వచ్చి పుస్తకాలు కొనుగోలు చేస్తారని కొందరు వ్యాపారులు ఎత్తుగడ వేసి ముద్రణకర్తల నుంచి చేజిక్కించుకున్నారని వినికిడి.
8వ తరగతికి చెందిన పుస్తకాలు మార్కెట్లో రూ.500 నుంచి 600 దాకా ధర పలుకుతున్నాయి. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినప్పుడు వారికి రాయితీ ఇస్తుంది. ఆ మేరకు వ్యాపారులు కూడా విద్యార్థులకు విక్రయించేటప్పుడు ఎంతో కొంత డిస్కౌంట్‌ ఇవ్వాలి. కానీ ప్రస్తుతం విజయవాడ, గుంటూరు మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రైవేటు విక్రేతలు అసలు డిస్కౌంట్లు ఇవ్వకపోగా ఈ పుస్తకాలు కావాలంటే తమ వద్దే రాత పుస్తకాలు(నోట్‌ బుక్స్‌), వాటికి అట్టలు కొనుగోలు చేయాలని షరతులు విధిస్తున్నారు. ఇవన్నీ తీసుకుంటేనే పాఠ్యపుస్తకాలపై ఐదు శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారని గుంటూరుకు చెందిన ఓ విద్యార్థి తండ్రి  ఆవేదన చెందారు. వాస్తవానికి ఏ పబ్లిషర్‌ అయినా తన వద్ద ఉన్న పుస్తకాలను విక్రయించేటప్పుడు 10 నుంచి 30 శాతం దాకా రాయితీలు ఇస్తారు. కానీ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయించటం రెండు నగరాల్లో కొందరు విక్రేతల తీరుగా మారిందని మరో విద్యార్థి తండ్రి తెలిపారు.
పుస్తక విక్రయాల మాటున జరుగుతున్న దోపిడీపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో విక్రేతలు మరింతగా దోచుకుంటున్నారు. కృష్ణా- గుంటూరు జిల్లాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలు 3లక్షల మంది వరకు ఉంటారు. వీరికి అధిక ధరలకు పుస్తకాలు అంటగట్టి వ్యాపార వర్గాలు భారీగా దోచుకుంటున్న మాట వాస్తవమేనని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నాయకుడొకరు తెలిపారు. విజయవాడ, గుంటూరులో సగటున ఒక్కోసెట్‌పై రూ.150 నుంచి రూ.200 దాకా అధికంగా వసూలు చేస్తున్నారు. అదే తెనాలి, నరసరావుపేట, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, బందరు వంటి రెండో శ్రేణి పట్టణాల్లో కొరత పేరు చెప్పి కొందరు వ్యాపారులు ఒక్కోసెట్‌ ధరను అమాంతంగా రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే పుస్తకాలు లేవని తాము అధిక ధరలు వెచ్చించిముద్రణకర్తల నుంచి తెచ్చామని చెబుతున్నారని డెల్టా ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడొకరు వివరించారు.
ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో 4, 5, 7వ తరగతికి సంబంధించిన అనేక పుస్తకాలు రాలేదు. 7వ తరగతి ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి కేవలం ఒకే ఒక్క పుస్తకం వచ్చింది. అదీ ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌. ఈ విద్యా సంవత్సరం గుంటూరు జిల్లాలో 450, కృష్ణా జిల్లాలో 276 ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పాఠశాలలకు సరిపడా ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు ఇప్పటిదాకా ముద్రించి ఇవ్వలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అవే కాదు తెలుగు, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు అన్ని పుస్తకాలు పూర్తి స్థాయిలో రాకపోవటంతో ఇప్పటిదాకా పంపిణీ చేయలేదని గుంటూరు జిల్లాకు చెందిన మండల విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. అసలు ముద్రణకర్తలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా ఉంది. తొలుత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరిపడా ముద్రించి అనంతరం వారు ప్రైవేటు వ్యాపారులకు ముద్రించాలి. అలాంటిది ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఎప్పుడు ముద్రించినా అడిగేవారు ఉండరని, తొలుత ప్రైవేటు వ్యాపారులకు ఇండెంట్‌ మేరకు ముద్రించి పంపుతున్నారని, దీనివల్ల వారి వద్ద పెద్ద మొత్తంలో నిల్వలు ఉన్నాయి.
కృష్ణా-గుంటూరు రెండు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూరు శాతం పుస్తకాలు పంపిణీ చేసినట్లు మచ్చుకు ఒక్క మండలం కూడా లేదని విద్యాశాఖ వర్గాలే చెబుతున్నాయి. దీన్నిబట్టి పుస్తకాల సరఫరా ఎంత తీసికట్టుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.బడులు ప్రారంభమైన వారం రోజుల్లోనే పుస్తకాలు అందజేస్తామని గుంటూరు డీఈఓ ఆ మధ్య చెప్పుకొచ్చారు. బడులు మొదలై వారం పైగా అయినా ఇప్పటి దాకా పాఠ్య పుస్తకాల గోదాముకు పూర్తిస్థాయిలో చేరలేదు. ఇప్పటికైనా రెండు జిల్లాల విద్యాశాఖలు అప్రమత్తమై  ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన పుస్తకాలను ఇండెంట్‌ మేర ఇవ్వకుండా ప్రైవేటుకు తరలించిన ముద్రణకర్తలపై కన్నేసి చర్యలకు సిద్ధపడితేనే సర్కారీ విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు సమకూరతాయనటంలో సందేహం లేదు. అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న పుస్తక వ్యాపారులే కాదు.. పాఠశాలలపైనా నిఘా పెడితే మార్కెట్లో పుస్తకాల విక్రయాల మాటున జరిగే దోపిడీకి అడ్డుకట్టపడుతుంది.

Related Posts