YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళితుల‌కు వ్య‌తిరేక ప్రభుత్వం బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్టర్ కె ల‌క్ష్మ‌న్

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళితుల‌కు వ్య‌తిరేక ప్రభుత్వం           బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్టర్ కె ల‌క్ష్మ‌న్
కేసీఆర్ ప్ర‌భుత్వం ద‌ళిత వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తూ.. ద‌ళితుల ప‌ట్ల తీవ్ర వివ‌క్ష చూపుతుంద‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ద‌ళిత వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని  బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు.మార్పు కోసం బిజెపి త‌ల‌పెట్టిన జ‌న చైత‌న్య యాత్ర ఆరో రోజుకు చేరుకున్నసంద‌ర్భంగా షాద్‌న‌గ‌ర్ కు బ‌య‌లుదేరే ముందు  మ‌హాబూబ్‌న‌గ‌ర్‌లో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ మీడియాతో మాట్లాడారు. ద‌ళిత ఐఏఎస్‌, ఐపీఎస్ ల‌కు ఈ ప్ర‌భుత్వం త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం లేద‌ని, వారికి బిజెపి అండ‌గా ఉంటుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ చెప్పారు. పేద‌ల సంక్షేమం కోసం న‌రేంద్ర‌మోదీ వివిధ అభివృద్ధి ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని, మోదీ ప‌థ‌కాల వ‌ల్ల ఇవాళ దేశంలో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా బిజెపి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేస్తూ వ‌స్తుంద‌ని, దేశంలోని 21 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ గుర్తు చేశారు.  మోదీ ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోలేక ప్రాంతీయ‌పార్టీలు కులాన్ని, మ‌తాన్ని అడ్డు పెట్టుకుని రాజ‌కీయాలు చేస్తున్నాయ‌న్నారు.మ‌తోన్మాద రాజ‌కీయాలు న‌డిపే మ‌జ్లిస్ పార్టీ రాష్ట్రంలో నంబ‌ర్‌వ‌న్ ద్రోహి అని, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీలు మ‌జ్లిస్‌ను పెంచిపోషించాయ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ దుయ్య‌బ‌ట్టారు.  మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు చ‌ట్ట విరుద్ధమైనప్ప‌టికీ.. ముస్లిం మైనారిటీల‌కు 4 శాతం నుంచి 12 శాతానికి రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. మ‌జ్లిస్ విధానాల‌ను అమ‌లు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీగా, టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీగా, టీఆర్ఎస్ - ఉద్య‌మ నాయ‌కుల పార్టీగా, టీఆర్ఎస్-తెలంగాణ ద్రోహుల‌తో కొన‌సాగుతున్న పార్టీగా డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అభివ‌ర్ణించారు. కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్క‌రికీ కోపం వ‌చ్చినా.. ఆ పార్టీ విచ్ఛిన్నమై నామ‌రూపాలు లేకుండా పోతుంద‌ని, టీఆర్ఎస్ నీటిబుడ‌గ పార్టీ అని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌కు పేర్లు మార్చి.. ఆ ప‌థ‌కాలు త‌మ‌వే అని చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌ని, కేంద్రం ఇస్తున్న నిధుల‌ను ఖ‌ర్చు చేసే స్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉంద‌ని, గ్రామ‌పంచాయతీల‌ను పూర్తిగా నిర్వీర్యం చేసింద‌న్నారు.  రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయిలో విక‌టాట్ట‌హాసం చేస్తుంద‌ని, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాల్లో క‌మీష‌న్ల దంద కొన‌సాగుతుంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ఆరోపించారు.క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డి హైద‌రాబాద్‌లో ఫ్యాష‌న్ డిజైన్ కోర్సులను గుర్తింపు లేని ప్రైవేటు కాలేజీల‌కు అప్ప‌గించి విద్యార్థుల భ‌విష్య‌త్‌ను ప్ర‌శ్నార్ధ‌కంగా మార్చార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధుల గురించి చెబుతుంటే..అన్ని నిధుల‌ను రాష్ట్రం ఏం చేసింద‌ని ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు.బిజెపి ప్ర‌భుత్వం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 11 ల‌క్ష‌ల ఇళ్లు కట్టిచ్చింద‌ని, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఒక్క ఎర్ర‌వెల్లిలో మాత్ర‌మే కొన్ని ఇళ్లు క‌ట్టించి చేతులు దులుపుకొంద‌న్నారు. సొంతింటి క‌ల నెర‌వేర్చుకోవ‌డం కోసం పేద‌ల‌కు త‌క్కువ వ‌డ్డీతో రుణాలు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చింద‌ని, దీని కోసం 3 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని, కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ ద‌ర‌ఖాస్తుల‌ను కేంద్రానికి పంపించ‌లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ దుయ్య‌బ‌ట్టారు. టీఆర్ఎస్ కు ద‌మ్ముంటే..పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించి త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల‌కు రావాల‌ని, కానీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం ఇష్టం లేని టీఆర్ఎస్ స‌ర్కార్ పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్ల‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు తావిచ్చింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ఆరోపించారు. దేశంలో మార్పులు తెస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌... సిద్ధాంతాలు, విధానాల‌ను ప‌క్క‌న పెట్టి క‌ర్ణాట‌క‌లో జేడీఎస్ కు మ‌ద్ధ‌తు ఇచ్చార‌ని, ఆయ‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్.. ఫ్యాష‌న్ ఫ్రంట్‌, ఫ్యామిలీ ఫ్రంట్ అయింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ విమ‌ర్శించారు.పేద‌లు, బ‌డుగులు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగు రేఖ‌లు నింపేందుకే బిజెపి జ‌న చైత‌న్య‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చింద‌ని, ఈ యాత్ర‌కు అపూర్వ స్పంద‌న ల‌భిస్తుంద‌ని, రాబోవు రోజుల్లో కేంద్ర మంత్రి ప్రకాష్ జ‌వ‌దేక‌ర్ యాత్ర‌లో పాల్గొంటార‌ని  డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల అవ‌కాశవాద రాజ‌కీయాల‌ను తిప్పికొట్టి, బిజెపితో క‌లిసి న‌డిచేందుకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ముందుకు రావాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ స‌ర్కార్‌కు త్రీసీల‌పై ( కాంట్రాక్టులు, క‌మీష‌న్లు, క‌రప్ష‌న్ ) ఉన్న శ్ర‌ద్ధ..ప్ర‌జ‌ల సంక్షేమంపై లేద‌ని, అవినీతి, అక్ర‌మాల‌తో నిద్ర‌మ‌త్తులో జోగుతున్న కేసీఆర్ ప్ర‌భుత్వానికి బిజెపి జ‌న‌చైన‌త్యకు వ‌స్తున్న ప్ర‌జ‌ల‌ను చూసి అయినా క‌నువిప్పు కావాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు.పేద‌లు, అట్ట‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు కోసం బిజెపి త‌ల‌పెట్టిన జ‌న‌చైత‌న్య‌యాత్ర ఆరోరోజు రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్‌కు చేరుకుంది. షాద్‌న‌గ‌ర్‌లో భారీ ఎత్తున స‌భ‌కు హాజ‌రైన జ‌నవాహినిని ఉద్దేశించి డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ మాట్లాడుతూ... కేసీఆర్ చేతిలో ద‌గాప‌డ్డ తెలంగాణ బిడ్డ‌ల కోసం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో మోస‌పోయిన యువ‌త కోసం ఈ యాత్ర అని స్ప‌ష్టం చేశారు. ఇది కేవ‌లం బిజెపి యాత్ర కాద‌ని, నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక ఈ యాత్ర అని అన్నారు.  రాష్ట్రం ఏర్ప‌డి నాలుగేళ్ల‌యినా.. నిరుద్యోగ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోయార‌ని, ల‌క్ష‌ల ఉద్యోగ ఖాళీలున్నాకేసీఆర్ ప్ర‌భుత్వం ఎందుకు ఉద్యోగాల భ‌ర్తీకి పూనుకోవ‌డం లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో 40 వేల‌కు పైగా టీచ‌ర్‌పోస్టులు ఖాళీగా ఉంటే.. ఒక్క పోస్టుకూడా భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో గ‌ట్టు మండ‌లంలో దేశంలోనే త‌క్కువ అక్ష‌రాస్య‌త ఉంద‌ని, నాలుగేళ్లయినా రాష్ట్ర‌ప్ర‌భుత్వం దీనిపై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని,నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌ని కేసీఆర్.. త‌న త‌న‌ కుటుంబంలో మాత్రం ఐదుగురికి రాజ‌కీయ ప‌ద‌వులు ఇప్పించుకున్నార‌న్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేసీఆర్ కుటుంబం కోస‌మా...?  లేక వెనుక‌బ‌డ్డ ప్ర‌జ‌ల కోసమా ...? అని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. తెలంగాణ కోసం అశువులు బాసిన అమ‌రుల కుటుంబాల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని, కేసీఆర్ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌తో అమ‌రుల కుటుంబాలు ఘోషిస్తున్నాయ‌న్నారు. 2022 నాటికి దేశంలో సొంతిల్లు లేని వారు ఉండ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో.. అపార‌మైన నిధులు ఇచ్చార‌ని, రాష్ట్రానికి   కేంద్రం ల‌క్షా 60 వేల ఇళ్ల‌ను మంజూరు చేసింద‌ని, కానీ.. కేసీఆర్ ప్ర‌భుత్వం ఈ నాలుగేళ్ల‌లో కేవ‌లం 11 వేల ఇళ్లు మాత్ర‌మే క‌ట్టింద‌న్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప‌క్క‌దారి ప‌ట్టించిన ఘ‌న‌త ఈ టీఆర్ఎస్ ప్ర‌భుత్వానిద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్  ధ్వ‌జ‌మెత్తారు. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి అనేక హామీల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం తుంగ‌లో తొక్కింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ - టీఆర్ఎస్ పార్టీలు రెండూ అవినీతి, కుటుంబ పాల‌న పార్టీలేన‌ని, కాంగ్రెస్ - టీఆర్ఎస్ రెండూ ఒకే గూటి ప‌క్షుల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. నిజాం పాల‌న‌ను గుర్తు చేసేలా కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించిన వారిని తొక్కేస్తూ.. నియంతృత్వ పాల‌న‌ను కొన‌సాగిస్తున్నాయ‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు తెలిపే అవ‌కాశం కూడా లేకుండా పోయింద‌ని, ఖ‌మ్మంలో మ‌ద్ధ‌తు ధ‌ర అడిగిన రైతుల‌కు బేడీలు వేసిన ఘ‌న‌త ఈ స‌ర్కార్‌ద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.నిజాం నవాబుల మెడ‌లు వంచిన తెలంగాణ ప్ర‌జానీకం, క‌నీసం తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకొనే  స్థితిలో లేక‌పోవ‌డం ద‌యానీయ‌మ‌ని, రానున్న రోజుల్లో తెలంగాణలో గ‌డీల పాల‌న కోట‌లు బ‌ద్ధ‌లు కావడం ఖాయ‌మ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు.మోదీ ప్ర‌భుత్వంలో మ‌హిళా ర‌క్ష‌ణ మంత్రిగా నిర్మ‌లాసీతారామ‌న్‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా సుష్మాస్వరాజ్ కు అవ‌కాశం ద‌క్కింద‌ని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు చోటేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల సాధికారిత కోసం రాష్ట్రంలో కనీసం ఒక క‌మిష‌న్‌ను కూడా ఏర్పాటే చేయ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. బ‌తుక‌మ్మ గుజ‌రాత్, సూర‌త్‌ల నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల‌ను తెచ్చింద‌ని,  అవే డ‌బ్బుల‌తో ఇక్క‌డి చేనేత కార్మికుల ద‌గ్గ‌ర చీర‌లెందుకు కొన‌లేద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను ప్ర‌శ్నించారు. ప్ర‌జారంజ‌క పాల‌న‌తో మోదీ.. దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నార‌ని,  స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్‌లో భాగంగా ఇంటింటికి మ‌రుగుదొడ్లు, ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న కింద ప్ర‌జ‌ల‌కు బీమా స‌దుపాయం, జ‌న్‌ధ‌న్ యోజ‌న‌లో భాగంగా పేద‌ల‌కు బ్యాంకు ఖాతాలు, అలాగే ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ద్వారా నిరుపేద‌ల‌కు ఇళ్లు, పేద‌ల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భార‌త్‌, ఉజ్వ‌ల ప‌థ‌కంలో భాగంగా పేద‌ల‌కు  8 కోట్ల ఉచిత గ్యాస్ క‌నెక్షన్లు ఇచ్చింద‌ని, ఒక్క తెలంగాణ‌లోనే 20 ల‌క్ష‌ల గ్యాస్ క‌నెక్ష‌న్లు ఇచ్చారని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ పున‌రుద్ఘాటించారు.అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి బిజెపి ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ తెలిపారు. మోదీ ప్ర‌భంజ‌నంతో కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల కోట‌లు బ‌ద్ధ‌ల‌వుతున్నాయ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ అన్నారు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ గ‌డీల కోట‌లు కూడా బ‌ద్ధ‌ల‌వుతాయ‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ స్ప‌ష్టం చేశారు. షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంలో భాగంగా మ‌న్‌రేగా కింద రూ. 29 కోట్లు, స్వ‌చ్ఛ‌భార‌త్ కింద రూ.1 కోటి 81 ల‌క్ష‌లు, మొక్క‌ల పెంప‌కం కోసం రూ. 2 కోట్ల 62 ల‌క్ష‌లు, 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేర‌కు పంచాయ‌తీల అభివృద్ధికి రూ.17 కోట్ల 6 ల‌క్ష‌లు ఇచ్చింద‌ని, ఇలా ఈ నాలుగేళ్ల‌లో కేంద్రం షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి మొత్తం రూ.51 కోట్ల 3 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చింద‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ వివ‌రించారు. ప‌ల్లెలు అభివృద్ధి చెందాలంటే.. పేద‌ల జీవితాల్లో మార్పు సంభ‌వించాలంటే.. అది బిజెపి వ‌ల్లే సాధ్య‌మ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపికి మ‌ద్ధ‌తిచ్చి గెలిపించాల‌ని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు జీ కిష‌న్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కుమార్‌, పార్టీ ప్ర‌ధాన కార్యద‌ర్శి ఆచారీ, జాతీయ ప్ర‌త్యేక ఆహ్వానితులు పేరాల శేఖ‌ర్, పార్టీ నేత‌లు, తదిత‌రులు పాల్గొన్నారు.ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌లు యాత్ర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. షాద్‌న‌గ‌ర్‌లో డాక్ట‌ర్ ల‌క్ష్మ‌న్ జ‌న చైత‌న్య‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భించింది. అంత‌కుముందు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు 600 బైకుల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఎక్క‌డ చూసినా బిజెపి జెండాల‌ను చేత‌బ‌ట్టి యువ‌త బైకుల‌పై నినాదాలు చేస్తూ హోరెత్తించారు. షాద్‌న‌గ‌ర్ వీధుల‌న్నీ బిజెపి కార్య‌కర్త‌లు, శ్రేణుల‌తో నిండిపోయాయి. ఈ కార్య‌క్ర‌మంలో భువ‌నగిరి మునిసిప‌ల్ ఛైర్మ‌న్  సువ‌ర్ణ‌, కౌన్సిల‌ర్ న‌రేష్‌, శివ‌సేన జిల్లా అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌, బిజెపిలో చేరారు.  

Related Posts