YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అందని వైద్యం

అందని వైద్యం
ఉత్తర తెలంగాణలో వైద్యానికి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి పెద్ద దిక్కు. ఈ దవాఖానాను నమ్ముకొని వస్తున్న పేదలకు మాత్రం సేవలు సక్రమంగా అందడం లేదు. 2005లో గొప్పగా కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, న్యూరో, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఫలితంగా పేద రోగులు విలవిల్లాడుతున్నారు. ప్రైవేటు వైపు పరుగులు తీస్తున్నారు. జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
కార్డియాలజీ విభాగానికి ఒక యూనిట్ మంజూరైంది. అందులో నలుగురు వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. తాజాగా సెలవుపై వెళ్లారు. రోగులను నెలరోజుల తర్వాత రమ్మని తిప్పి పంపుతున్నారు. ఇటీవల రూరల్‌ జిల్లా నుంచి గుండెపోటుతో ఒకరు రాగా.. పీజీ వైద్యులు చికిత్స అందించి, ప్రైవేటుకు వెళ్లాలని సూచించారు. వెంటనే ఆయన బంధువులు ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి ప్రాణం కాపాడారు. ఓపీ వారానికి రెండు రోజులు పని చేస్తుండగా, కనీసం రోజుకు 150 మంది వస్తున్నారు. జనరల్‌ ఫిజీషియన్‌తో నెట్టుకొస్తున్నారు.
సీటీ సర్జరీ విభాగం ఉన్నా, ప్రస్తుతం వైద్యులు లేరు. ఒకప్పుడు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇప్పుడు నిలిచిపోవడంతో ఆరోగ్యశ్రీ లేని వారు ప్రైవేటులో కనీసం రూ. 4 లక్షల నుంచి 6 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. న్యూరోఫిజీషియన్‌ ఒకరు ఉన్నారు. యూనిట్  కింద నలుగురు అవసరం. ఈ విభాగం వారానికి రెండు రోజులు పనిచేస్తోంది. ఇక్కడికి రెండు రోజుల్లో కనీసం 200 మంది వరకు వస్తారు. కేవలం ఒక్క డాక్టర్‌ ఉండడం వల్ల సేవలు అందించడం కష్టంగా మారింది. నిత్యం 20 మంది చేరుతున్నారు.
న్యూరో సర్జరీ విభాగంలోనూ ఒకరే సేవలందిస్తున్నారు. శస్త్రచికిత్సలు పెద్ద సంఖ్యలో అవసరం అవుతాయి. ఆపరేషన్లు చేయడం ఎంత కీలకమో తర్వాత అబ్జర్వేషన్‌ (పర్యవేక్షణ) అంతే ముఖ్యం. పర్యవేక్షణకు సంబంధిత వైద్యులు సరిపడా లేకపోవడంతో శస్త్రచి కిత్సలు అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి.
యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ సూపర్‌ స్పెషాలిటీ విభాగాల్లో ఎవరూ లేకపోవడంతో అవి పూర్తిగా మరుగున పడిపోయాయి. వీటితోపాటు ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో వైద్యుల నియామకం లేదు. కొనుగోలు చేసిన పరికరాలన్నీ వృథాగా పడి ఉంటున్నాయి. ఉన్న విభాగాల్లోని వైద్యులు  వ్యక్తిగత అవసరంపై సెలవుపై వెళితే ప్రత్యామ్నాయం ఉండరు. వారు వచ్చే వరకు రోగులు వేచి చూడాల్సిందో. ఒప్పందంపై పనిచేయడానికి నిపుణులైన వైద్యులు సిద్ధంగా ఉన్నా నియమించుకోకుండా తాత్సారం చేస్తున్నారు.

Related Posts