వార్తలు సాహిత్యం

సంబంధాల బలోపేతానికే పండగలు 

Highlights

  • వివిధ రంగాల్లోని ప్రతిభకు పట్టం 
  • తెలుగు అకాడమీ పురస్కారం
  • తెలుగువారు ఎక్కడున్నా, 
  • పండగలను సమిష్టిగా 
  • జరుపుకునేందుకు ఇష్టపడతారు 
  • అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి
సంబంధాల బలోపేతానికే పండగలు 

సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు పండగలు దోహదం చేస్తాయని భారత ఉపరాష్ట్రపతి ఏం. వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో 30వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రభావంతులకు ఆ ఇరువురి చేతుల మీదుగా పురస్కారాలను అందచేశారు.

తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్ .నాగరాజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో  మార్గదర్శి గ్రూప్ ఎండీ శైలజా కిరణ్ కు ఉద్యోగ రతన్ అవార్డును అందుకున్నారు. అదే విధంగా  సినీ నటుడు జగపతిబాబు, ఉదయ్ శంకర్ అవాస్తిలు  జీవన సాఫల్య పురస్కారాలను సొంతం చేసుకున్నారు. వీరితో పాటుగా సినీ నటి రమ్యకృష్ణ, సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ, డాక్టర్ సుధారాణిలను ప్రతిభా భారతి పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.  గాయకులు విజయలక్ష్మి, కె.హారిక, ఇ.మనీష, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌, సాకేత్‌లను కూడా  సత్కరించారు. ఈ సందర్బంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... 


భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని  కొనియాడారు. ఈ వ్యవస్థ ఉన్నతికి ఢిల్లీ తెలుగు అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ క్రమంలో  వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని తమ పురస్కారాలతో ప్రోత్సహించడం స్ఫూర్తిదాయకమన్నారు.  తెలుగువారి మనోవికాసానికి డీటీఏ చేస్తున్న కృషిని అభినందించారు. అచ్చమైన తెలుగుదనానికి ప్రతీక ఉగాది అని, షడ్రుచుల మేళవింపుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే తెలుగు వారందరి జీవితాల్లో వసంతం రావాలని ఆకాంక్షించారు. అమ్మ అనే పిలుపు అంతరాళం నుంచి వస్తుందని మాతృభాషను విస్మరించొద్దని ఉద్ఘాటించారు. పురస్కార గ్రహీతలు ఇతరులకు ఆదర్శంగా కావాలని వెంకయ్యనాయడు ఆకాంక్షించారు.


తెలుగువారు ఎక్కడున్నా, పండగలను సమిష్టిగా జరుపుకోవడానికి ఇష్టపడతారని సభ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.  పిల్లలకు తల్లిదండ్రులు మాతృభాషను నేర్పించాలని, మాతృభాషలో పట్టు సాధిస్తే ఇతర భాషలనూ సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో తమిళ భాష కార్యక్రమాల తరహాలో  తెలుగు భాషలోనూ చర్చలు, ఇష్టాగోష్ఠులు జరగడానికి ఢిల్లీ తెలుగు అకాడమీకి శాశ్వత భవనం కావాలన్నారు. ఇందుకు ఉపరాష్ట్రపతి చొరవ చూపాలని జస్టిస్ రమణ విజ్ఞప్తి చేశారు.

ఈ  కార్యక్రమంలో డీటీఏ కార్యనిర్వాహక ఛైర్మన్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌, ఛైర్మన్‌ మోహన్‌ కందా, ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్ నాగరాజు పాల్గొన్నారు.

 

మర్చిపోలేని మధుర జ్ఞాపకం.

దేశరాజధానిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సత్కారం అందుకోవడం గొప్ప అనుభూతిని కలిగించిందని డీటీఏ ఉద్యోగ రతన్‌ ఉగాది పురస్కార గ్రహీత మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ  పురస్కారం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ‘‘మార్గదర్శికి 28 ఏళ్ల వయసులో నన్ను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రామోజీరావు ప్రకటించారు. చిన్న వయసులో ప్రజల డబ్బు నిర్వహణ చేయగలనా అని భయమేసింది. ఇది మన డబ్బు కాదు ప్రజల డబ్బు. ప్రతి ఒక్కరికీ వెనక్కి ఇవ్వాలన్న బాధ్యతతో నడుచుకుంటే ఇబ్బంది ఉండదని రామోజీరావు సూచించారు. ఆ మేరకు నడుచుకుంటూ ప్రస్తుతం 105 శాఖలతో 9500 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించాం. 4400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మూడున్నర లక్షల మంది జీవితాల్లో నమ్మకం కలిగించి వాళ్లకి అవసరమైన సమయాల్లో సకాలంలో సొమ్ములు ఇవ్వగలిగాం. పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇలా అవసరమైనప్పుడు మార్గదర్శి ద్వారా అందజేయగలుతున్నాం. వారంతా చక్కగా అభివృద్ధి చెందుతున్నారు.

దేశరాజధాని దిల్లీలోని తెలుగువారిని చూస్తుంటే తనకెంతో ఉత్సాహం వచ్చిందన్నారు. తెలుగువారంతా అభివృద్ధి చెందాలని, ఉగాది పర్వదినాన మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నా’’ అని శైలజాకిరణ్‌ ఆకాంక్షించారు.