YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చీలిపోనున్న గులాబీ వ్యతిరేక ఓట్లు

చీలిపోనున్న గులాబీ వ్యతిరేక ఓట్లు

తెలంగాణలో మందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షాలు ఎన్నికలకు ఏమాత్రం సన్నద్ధం కాకముందే అసెంబ్లీని రద్దు చేసి వారికి షాకిచ్చారు. గులాబీ బాస్ కేసీఆర్. అంతేకాదు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి మరో సంచలనానికి తెరతీశారు. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ముందుండాలనే లక్ష్యంతోనే కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. హుస్నాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి ఎన్నికల శంఖారావన్ని కేసీఆర్ పూరించగా… ప్రకటించి అభ్యర్థులు సైతం వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారభించేశారు. అయితే, టీఆర్ఎస్ అంత దూకుడుగా కాకున్నా… రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా వేగంగా స్పందిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా చూడాలనే ప్రధాన లక్ష్యాన్ని పెట్టుకున్నాయి.ముఖ్యంగా కేసీఆర్ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దు అని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ భావించాయి. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ తెలంగాణ జన సమితి, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలను కలుపుకుని ఎన్నికలకు పోవాలని నిర్ణయించాయి. ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం ఒంటరిగానే పోటీ చేయనుంది. అంటే బీజేపీ మినహా ప్రతిపక్షాలన్నీ కలిసినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి కూడా పడే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఇప్పటికే ఖరారైనట్లు కనపడుతోంది. సీపీఐతో గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు పోత్తు ఉంది. అదే మళ్లీ పునరావృతం కానుంది. తెలంగాణ జన సమితితోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికైతే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు మాత్రం కలిసి మహాకూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, సీపీఎం వైఖరి మాత్రం ఈ పార్టీలకు మింగుడు పడటం లేదు. సీపీఎంను కూడా తమతో కలుపుకుని వెళ్లాలని భావించినా సీపీఎం మాత్రం జనసేన పార్టీతో స్నేహానికై చేయి చాస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీలు సందర్భానుసారం కలిసి పనిచేస్తున్నాయి. అయితే, ఎన్నికల్లో పొత్తు ఉంటుందా..? ఉండదా..? అనే విషయం పక్కనపెడితే కమ్యూనిస్టు పార్టీలు మాత్రం పొత్తు పెట్టుకోవాలే ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ మాత్రం సీపీఐ మహాకూటమిలో కలవడానికి మొగ్గు చూపింది. సీపీఎం మాత్రం జనసేన వైపు చూస్తోంది. అయితే, జనసేన – సీపీఎం కలిస్తే మాత్రం మహాకూటమికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. జనసేన పార్టీకి తెలంగాణలో క్యాడర్ లేకున్నా పవన్ కళ్యాణ్ కు అభిమానులు మాత్రం ఉన్నారు. ఇక సీపీఎం పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. ఇవి రెండు పార్టీలు కలిస్తే ప్రతీ నియోజకవర్గంలోనూ అభ్యర్థిని నిలబెట్టి ఎన్నోకొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దీంతో, ఐక్యంగా పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయగలిగి టీఆర్ఎస్ ను గద్దె దించాలని భావిస్తున్న పార్టీలకు జనసేన – సీపీఎం కలయిక అస్సలు రుచించడం లేదు. ఈ రెండు పార్టీల కూటమి ప్రత్యేకంగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి కచ్చితంగా టీఆర్ఎస్ లాభం చేకూరుతుంది. మొత్తానికి మహా కూటమి ద్వారా టీఆర్ఎస్ ఓడించాలనే మహాకూటమి ఆశలను జనసేన – సీపీఎం పార్టీల పొత్తు అడియాశలు చేస్తున్నాయి.

Related Posts