YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేతలకు కాంగ్రెస్ టెన్షన్

వైసీపీ నేతలకు కాంగ్రెస్ టెన్షన్

సంక్షేమ పథకాల ప్రచారంతో విజయం సాధించాలన్న జిల్లా వైసీపీ నేతలకు ఇపుడు కాంగ్రెస్ పార్టీ గుబులు రేకెత్తుతోంది. జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే అధికార తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని ఆ పార్టీ నాయకులే అంతర్గత సమావేశాల్లో పేర్కొంటున్నారు. ఇదే విషయం టీడీపీ, వైసీపీ చేయించిన సర్వేల్లో కూడా స్పష్టమైంది. టీడీపీ సర్వే ప్రకారం జిల్లాలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో సుమారు 6 నుంచి 8 శాతం ఓట్లు గండిపడనున్నట్లు స్పష్టమైనట్లు వెల్లడవుతోంది. ఇందుకు ప్రభుత్వం జిల్లాపై అనుసరిస్తున్న విధానాలతో పాటు జిల్లాలో నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడమేనని సర్వేలో స్పష్టమైనట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీన కర్నూలు పర్యటనకు వస్తుండటంతో ఆ పార్టీ నాయకులు గత వారం, పది రోజులుగా దాదాపు అన్ని గ్రామాలు తిరిగి తమ అధినేత రాకను ప్రజలకు వివరించి బహిరంగ సభకు రావాలని కోరుతున్నారు. అదే సమయంలో పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజల కోసం ప్రవేశపెట్టే పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఎన్నికల అనంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలి సారి జనంలోకి వెళ్లారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసినా నామ మాత్రపు ప్రచారంతో ‘మమ’ అనిపించారు. తాజాగా రాహుల్ రాక సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలకు వెళ్లడం, పార్టీ ఎన్నికల హామీలను వివరించడం వంటి ప్రచార కార్యక్రమం చేపట్టారు.ప్రజల వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యల పరిష్కారానికి పార్టీ నేతలతో గ్రామదర్శిని కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉత్సాహంగా పాల్గొనలేదని సర్వేలో తేలినట్లు సమాచారం. అంతేగాకుండా పార్టీ నేతలు సూచించిన సమస్యల పరిష్కారంలో అధికారులు కూడా జాప్యం చేయడం వల్ల పార్టీ కార్యక్రమం ప్రయోజనం చేకూర్చలేదని స్పష్టమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రజా వ్యతిరేకతకు కారణమని సర్వే నివేదిక వెల్లడించినట్లు సమాచారం. ఒక వైపు టీడీపీ బలహీనపడినా మరో వైపు వైసీపీ పరిస్థితి గత ఎన్నికల కన్నా ఏ మాత్రం మెరుగు పడలేదని అదే సర్వేలో తేలినట్లు తెలిసింది.సర్వేలో పార్టీ బలం గతంలో కన్నా మెరుగు పడిందని, ఇంకా కష్టపడితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు పార్టీ సొంతం చేసుకుంటుందని తేలినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. దీంతో ఇంతకాలం పార్టీ నేతలు విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నా ఇటీవలి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు పెరిగితే అది వైసీపీకు నష్టం చేకూర్చడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నష్టపోయిన 8 శాతం ఓట్లు వైసీపీకు వస్తాయని వారం కిందటివరకు భావించిన వైసీపీ నేతలు ఇపుడు ఆ ఓట్లలో అత్యధికం కాంగ్రెస్ రాబట్టుకుంటే తమకు ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా రైతు రుణాలు రూ.2లక్షల వరకు ఒకే దఫాలో మాఫీ చేస్తామన్న హామీ తమకు ఇబ్బందికరమేనని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. ఇక పొదుపు, విద్యా రుణాల మాఫీ విషయం కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగడానికి కారణమవుతాయని వారు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆ పార్టీ నాయకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో పతనమైన కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ కారణంగా జిల్లాలో టీడీపీకే ఎక్కువ నష్టమని ఆయన అంచనా వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింత పెరిగి టీడీపీ నష్టం చేస్తుందే కాని వైకాపా ఓట్లను కాంగ్రెస్ హామీలు ప్రభావితం చేయలేవని ఆయన స్పష్టం చేస్తున్నారు

Related Posts