YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో బాబ్లీ రాజకీయం

తెలుగు రాష్ట్రాల్లో బాబ్లీ రాజకీయం

ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేయటం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం వర్గాల్లో  పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ, వైసీపీల కుట్రలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు పంపారని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా స్పందించకుండా ఇప్పుడే నోటీసులు అందజేయటంలోని ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రాంతీయ పార్టీలతో సహా సీపీఐ, కాంగ్రెస్‌లతో కలిసి మహాకూటమిగా అవతరించేందుకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో నోటీసులు ఏ రకమైన ప్రభావం చూపుతాయనే విషయమై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం. ఈ నోటీసులను ఏపీ టీడీపీ నేతలతో పాటు టీటీడీపీ నేతలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా 2010లో జరిగిన ఆందోళన నేపథ్యంలో  చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు ప్రాజెక్టు ముట్టడికి యత్నించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుతో సహా ఆందోళనకు దిగిన సుమారు 80 మందిని ఒకే చోట నిర్బంధించి ఆపై కేసులను కూడా నమోదు చేసింది. ఈ సంఘటన యూపీఏ హయాంలో జరిగితే తాజాగా ఎన్డీయే ప్రభుత్వం కేసును తిరగతోడటం రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలావుండగా కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు వ్యూహరచన చేశారనే వార్తలు ఆమధ్య వినిపించాయి.ఇదే తరహాలో తెలంగాణలో కూడా పావులు కదుపుతున్నారనే భయంతో బీజేపీ నోటీసులు తెరపైకి తెస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు ఉన్న తమకు నోటీసులు ఎందుకు పంపలేదని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ప్రశ్నించడం విశేషం. కాగా గత ఎనిమిదేళ్లుగా 22 సార్లు నోటీసులు అందాయని కోర్టుకు హాజరుకానందునే అరెస్టు వారెంట్ జారీ అయిందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే పీసీసీ మాత్రం అరెస్టు వారెంట్ నోటీసులను తీవ్రంగా ఖండించింది. రాజకీయ దురుద్దేశ్యంతో ప్రజా ఉద్యమాలకు సంబంధించి అరెస్టు వారెంట్ జారీ చేయటం సమంజసంకాదని పీసీసీ చీఫ్ రఘువీరా ఖండించటం కొసమెరుపు. ఇదిలా ఉండగా ధర్మాబాద్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే విశేషం. మహారాష్ట్రలోని కోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంతనాలు జరుపుతున్నారు. 2008లో బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందాన్ని అప్పటి ప్రభుత్వం అడ్డుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అప్పటి కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుతో పాటు మరికొందరిపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 21వ తేదీలోగా కోర్టుకు హాజరుకావాలని చెప్పింది. అయితే హాజరుకాకుంటే కోర్టు థిక్కారం కిందకు వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.కోర్టుకు హాజరయి వెంటనే బెయిల్ తెచ్చుకోవచ్చన్నది న్యాయనిపుణుల సూచన. అయితే మరికొందరు మాత్రం న్యాయమూర్తి బెయిల్ నిరాకరిస్తే ఏంచేస్తారన్న అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు  మరోసారి న్యాయ నిపుణులతోనూ, టీడీపీ సీనియర్ నేతలతోనూ, నోటీసులు అందుకున్న టీడీపీ నేతలతోనూ సమావేశమై ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. పార్టీ నేతలు మాత్రం కోర్టుకు హాజరవ్వడమే మంచిదని, దానివల్ల తెలంగాణలో పార్టీకి మైలేజీ వస్తుందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Posts