YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోహినీ అవతారంలో జగన్మోహనుడు

మోహినీ అవతారంలో జగన్మోహనుడు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార  రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. 
జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్పస్వామివారు సోమవారం రాత్రి గరుడవాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదేరోజు తిరుమలలో శ్రీవారు శ్రీవిల్లిపుత్తూరు నుండి విచ్చేసిన ప్రత్యేక మాలలు, చెన్నై నుండి వచ్చిన అలంకృత ఛత్రాలు స్వామివారి గరుడవాహన సేవకు మరింత శోభను చేకూర్చుతాయి. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు   పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి  అనిల్కుమార్ సింఘాల్, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధి కె.యస్.శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు  మేడా రామకృష్ణారెడ్డి, సుధానారాయణమూర్తి,   పొట్లూరి రమేష్ బాబు, ప్రత్యేక ఆహ్వానితులు  రాఘవేంద్రరావు,  ఎన్.కృష్ణా, ఆలయ డిప్యూటి ఈఓ  హరీంద్రనాథ్, పేష్కార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts