YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బి ప్లాన్ దిశగా కోదండరామ్ అడుగులు

 బి ప్లాన్ దిశగా కోదండరామ్ అడుగులు
తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఇటీవలే తెలంగాణ జనసమితి పేరిట నూతన రాజకీయ పార్టీని ఏర్పాటుచేసి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే ఆయన పార్టీకి సొంత బలం తగినంతగా లేనందున ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ తో మంతనాలు జరిపారని తెలుస్తోంది. అలాగే తాజాగా బీజేపీ నేతలతో సమావేశమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ నుంచి తమ పార్టీకి మెరుగైన సీట్లు వస్తే ఆ దిశగా ముందడుగు వేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. మహాకూటమిలో భాగంగా తెలంగాణ జనసమితికి కాంగ్రెస్‌ కేవలం 3 సీట్లే కేటాయిస్తుందన్న సమాచారంతో కోదండరాం అసంతృప్తిగా ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో ఆయన ప్లాన్‌ బి అమలు చేసే పనిలో ఉన్నారు. బీజేపీతో ఆయన భేటీ అయినట్లు సమాచారం. గతంలో 119 స్థానాలకు పోటీ చేస్తామని చెప్పిన కోదండరాం… మహా కూటమిలో చేరాలని నిర్ణయించారు. అయితే 3 సీట్లే ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పడంతో ఆయన కినుక వహించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పొత్తులపై చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. 17 సీట్లు ఇస్తే మహాకూటమితోనే వెళ్లాలని, లేదా బీజేపీతో కలిసి వెళ్లే అంశాన్ని పరిశీలించమని టీజేఎస్‌ నేతలు కోదండరాంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా సమాచారం. మహాకూటమి లో ఇప్పుడు కోదండరామ్ వైఖరి కొరుకుడుపడటంలేదనే వాదన వినిపిస్తోంది. కామన్‌ మినిమం ప్రోగ్రాం ఏర్పాటు చేసి దానికి తనను చైర్మన్‌ ను చేయాలని, అలాగే 30 వరకూ టీజేఎస్‌ కు సీట్లు కావాలని మొండిపట్టు పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు వాపోతున్నారు. అందుకే కూటమి సీట్లు సర్దుబాటు కొలిక్కి రావడం లేదని తేల్చిచెబుతున్నారు.కోదండ పోటీచేసి స్థానం పేరు చెబితే అభ్యర్థులను సర్దుబాటు చేసుకుందామని కాంగ్రెస్‌ కోరుతున్నా ఆయన నోరు మెదపడం లేదని సమాచారం. కాగా కోదండరాం సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ ఎస్‌ పార్టీ తరఫున మంత్రి పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ – టీడీపీలకు సరైన బలం – అభ్యర్థులు లేకపోవడంతో ఈ నియోజకవర్గమే బెస్ట్‌ అనే ఆలోచనలో కోదండరాం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా ఉన్న సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కోదండరాంను ఆదరించవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సికింద్రాబాద్‌ అసెంబ్లీ పరిధిలో ఉండడానికితోడు ఆ యూనివర్సిటీలోనే కోదండరాం ప్రొఫెసర్‌ గా విధులు నిర్వర్తించడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారట. అలాగే మాణికేశ్వర్‌ నగర్‌ – అడ్గగుట్ట ఏరియా ప్రజలతో కోదండకు మంచి పరిచయాలున్నాయని తెలుస్తోంది. అలాగే కోదండరాం నివాసం కూడా తార్నాకలో ఉండడంతో మరింత కలిసి వచ్చే అంశంగా చూస్తున్నట్టు తెలిసింది. ఇన్ని అవకాశాల నేపథ్యంలోనే ఆయన సికింద్రాబాద్‌ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే గెలిచాక కోదండను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ చూస్తోందట. కానీ కోదండ మాత్రం అసెంబ్లీలోనే గళమెత్తుతానని అంటున్నారని సమాచారం. సికింద్రాబాద్‌ లో బలమైన టీఆర్‌ ఎస్‌ మంత్రి పద్మారావుకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఇక్కడ కోదండరాం లాంటి వ్యక్తే సరైన వారని ప్రచారం జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలిమరి.

Related Posts