YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వర్షాలు.. కష్టాలు..

వర్షాలు.. కష్టాలు..
ఆగస్టు చివరి వారంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు తెలంగాణ తడిసిముద్దైంది. ప్రాజెక్టులు, నదులు, వాగులు, వంకలు, చెరువులు, బావులు, నీటి కుంటలు నిండిపోయాయి. అంతేనా పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. కొన్నిచోట్ల మోకాలు లోతు నీటిలో పంటలు మునిగిపోయాయి. మొత్తంగా నాటి వర్షాల ధాటికి పంటలు తీవ్రంగా ప్రభావితమయ్యాయనే చెప్పొచ్చు. ఏదైతేనేం వర్షాల ఎఫెక్ట్‌తో పంట దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి పంటను కాపాడుకునేందుకు ప్రస్తుతం రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఎప్పట్లాగే ఈ ఏడాదీ ఆర్ధిక సమస్యలు తప్పవేమోననే ఆందోళనే వారిలో నెలకొంది. వానలు కురవడం మంచిదే. ఐదేళ్లుగా దారుణంగా పడిపోయిన భూగర్భజల మట్టాలు పెరగడంతో పాటూ నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. అయితే పంటలు ధ్వంసమైతే మాత్రం రైతాంగం దారుణంగా నష్టపోతుంది. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు తడసిమోపెడైన పరిస్థితి. పలువురు రైతులు అప్పులు చేసి సాగు చేస్తున్నారు. ఇలాంటి రైతులు ప్రతికూల వాతావరణం వల్ల మరింతగా నష్టపోతున్న దుస్థితి. ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని పలువురు రైతులు సైతం ఇలాంటి కష్టంలోనే కూరుకుపోయారు. వేలకు వేలు పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని ఈ ఏడాది ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని బాధిత రైతులు ఆవేదనభరితమవుతున్నారు. ఉన్న కొద్దిపాటి పంట ద్వారా పెద్దగా ఫలితం ఉండదని చెప్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  
జిల్లాలో దాదాపు 1,25,708 ఎకరాల్లో వివిధ పంటలకు వర్షాల కారణంగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో అయితే వరదల ఎఫెక్ట్‌కు పంటలు పూర్తిగా నామరూపాల్లేకుండా పోయాయి. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం ఫలితం దక్కని దుస్థితి. మళ్లీ సాగుచేసుకుందామంటే భారీగానే పెట్టుబడి పెట్టాలి. ఇప్పటికే అప్పులు చేసిన రైతులు మరోసారి అదే స్థాయిలో అప్పు చేయాలంటే కష్టమే. ఖరీఫ్ పంటకు దూరమైన పరిస్థితి. కొన్ని రోజుల్లో రబీ సీజన్ మొదలైపోతుంది. చేతికందే స్థితికి చేరిన పంటలు కనుమరుగవడంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. మరోవైపు వరదల ధాటికి పలు ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేసింది. చిన్న చిన్న రాళ్లు సైతం చేరాయి. ఇలాంటి వ్యవసాయక్షేత్రాలను బాగుచేసుకోవడం కర్షకులకు కష్టంగానే ఉంది. ఇసుక, రాళ్లు తొలగించేందుకు ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. దీంతో రైతులు పలు విధాలా నష్టపోయారు. ఆర్ధికంగా కుదేలయ్యారు. పంట నష్టంపై సంబంధిత అధికారులు సర్వే చేశారు. అయితే పరిహారం మాత్రం అందలేదని కొందరు రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పరిహారం అందితే కనీసం రబీ సాగు సమయానికైనా పొలాలను బాగు చేసుకుని పంటలు వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి ఉండేవాళ్లమని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

Related Posts