YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్కరకు రానీ కేసీఆర్ మంత్రా

 అక్కరకు రానీ కేసీఆర్ మంత్రా
నాలుగు వసంతాలకు పైబడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రభుత్వ ఏలుబడిలో, ఏలికకు అడుగడుగునా అసంతృప్తులు ఎదురైనా, వాటిని ఎప్పటి కపుడు దాటవేస్తూ, ప్రజల దృష్టికి వాటిని పెద్దవి కానీకుండా, తమదైన శైలిలో పరిపాలన కొనసాగించి సమయస్ఫూర్తికి మారుపేరుగా నిలిచారు కేసీఆర్. ఉద్యమ పార్టీగా తెరాస ప్రస్తానం ప్రారంభించి, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛితాలను సాకారం చేయడమే ఏకైక లక్ష్యంగా తాడోపేడో తేల్చడానికి ఉద్యుక్తులమై, యుద్ధ్భూమిలో అడుగిడినామని విశ్వసింపచేసి, ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతిగా రూపుదాల్చి, సెంటిమెంటే ప్రధాన ఆయుధంగా, ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యాన్ని చేరుకున్నాక, ప్రారంభ పార్టీ తెర మరుగై, పక్కా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన క్రమంలో, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించి, ఉద్యమాన్ని అణువణువునా అడ్డుకుని, గల్లీ నుండి ఢిల్లీ దాకా మోకాళ్ళడ్డువేసి, ఉద్యమాన్ని నీరుగార్చే పార్టీల ప్రతినిధులుగా వ్యవహరించిన పలువురిని తెరాసలోనికి సాదరంగా ఆహ్వానించి, వారికి బ్రహ్మరథం పట్టి, చేరినదే తడవుగా, ఉన్నత పదాధికారుల చేసిన సందర్భాలలో ఆదినుండి ఉద్యమంలో చిత్తశుద్ధితో పాల్గొని, ఉద్యమాన్ని తమ భుజస్కందాలపై మోసిన ఉద్యమ కారులకు, రాజకీయ వలస వాదుల పట్ల తెరాస అధినేత వైఖరి తొలి అసంప్తికి కారణమైంది. అలాగే తెరాస స్థాపనతో, వివిధ రాజకీయ పార్టీలలో ఇముడలేని, పలు కారణాల వల్ల ఆయా పార్టీలను కాదని, తెరాసలో చేరి, ఉద్యమంలో క్రియాశీలక పాత్రలు పోషించిన నాయకులకు, తమ తమ పూర్వాశ్రమాల నుండి యుద్దమంతా ముగిసి, సయోధ్య కుదిరాక, రాజకీయ స్వార్థంతో, తెరాస అధినేతకు మోకరిల్లి, వీర విధేయులమై ఉంటామని ఆనచేసి, కేసీఆర్ నాయకత్వ శిబిరంలో చొచ్చి, తమను పక్కన నెట్టి, పదవులు పొందడం మింగుడు పడని అంశమై అసంతృప్తి జ్వాలలకు ఆజ్యం పోసింది. ప్రజా మద్దతు కలిగిన అధికార పార్టీలో చేరితే తమకు రాజకీయ భవిష్యత్ ఉండగలదని ఎంచి, స్వార్థ లాభాపేక్షతో తెరాసలో చేరిన మరి కొందరికి ప్రాధాన్యత కొరవడి, గతానికి, ప్రస్తుతానికి తేడా లేని స్థితిలో ఏమి చేయాలో తోచని స్థితికి చేరుకునే దుస్థితి ఎదురైంది. భవిష్యత్తుపై దృష్టి ఉంచి, మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాన్నింటిలో దాదాపు సత్ఫలితాలను సాధించిన కేసీఆర్‌కు, నియోజక వర్గాల పునర్విభజన కాని అంశం అశనిపాతమైంది. పార్టీలో చేరిన వారందరికీ రాజకీయ పునరావాసం కల్పించాలని యోచించిన గులాబీ దళ నేతకు నియోజకవర్గాలు పెరగక పోవడం కలిసిరాని అంశమైంది. గత ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలై, నియోజకర్గాలను, మద్దతు తెలిపిన ప్రజలను వీడక, సమస్యలపై స్పందిస్తూ, అధికార పార్టీ అవసరాల దృష్ట్యా, వ్యూహ రచనలో భాగంగా అధినేత తమ ప్రత్యర్థులకు పెద్దపీటలు వేస్తూ, గెలిచిన వారిని అందలం ఎక్కించినా, గులాబీ పార్టీలో కొనసాగుతూ, రానున్న ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదిరి చూస్తు న్న పరాజితులకు, 105 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది.ఇన్నేళ్ళుగా, ఇన్నాళ్ళుగా గంపెడాశతో చూసిన ఎదురు చూపులు ఎండమావులవుతున్న వేళ...పార్టీలో కొనసాగడమా? కండువా మార్చడమా? తేల్చుకోలేక కొట్టుమిట్ట్టాడుతున్న విచిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. వ్యూహమేదైనా, లక్ష్య సాధన ఎలా ఉన్నా, కోరి తెచ్చుకున్న ముందస్తు ఎన్నికలలో చంద్రశేఖర్‌రావు, ఇంటిపోరును ఎలా పరిష్కరిస్తారో? అసంతృప్తులను ఎలా దూరం చేస్తారో, ఎన్నికల సమరాంగణాన ఎలా దూసుకుపోతారో వేచి చూడాల్సిందే. మాటల మంత్రాలతో విపక్షీయులను స్వీయ రక్షణలకే పరిమితం చేస్తూ, మారుమాట్లాడనీకుండా చేయగల కేసీఆర్ నైపుణ్యం, స్వపక్షంలో పనిచేయదని తెలిసినందున మంత్రం కాకుండా ఏ తంత్రం వినియోగించి అగ్ని పరీక్షలో నెగ్గుతారో సమీప భవిష్యతే సమాధానం చెప్పనుంది.

Related Posts