YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

అట్టహాసంగా యువజనోత్సవాలు..

అట్టహాసంగా యువజనోత్సవాలు..

 తెలంగాణ రాష్ట్ర యువతలో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో చేపట్టిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు-2018 కార్యక్రమం నగరంలోని యూత్‌ సర్వీసెస్‌ కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈనెల 8వతేదీన ప్రారంభమైన కార్యక్రమం 9,10 తేదీల్లో కూడా ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యాలయంలో మూడు వేదికల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో వివిధ జిల్లాలనుంచి వచ్చిన యువతీయువకులు పాల్గొన్నారు.

సంగీతం, నృత్యం, జానపదం నృత్యానికి సంబంధించిన పోటీల్లో తమ ప్రదర్శనలిచ్చారు. యువజనోత్సవాలను ఉద్దేశించి గతేడాది డిసెంబరులో రాష్ట్రంలోని 31జిల్లాల్లో వివిధ రంగాల్లో ప్రతిభఉన్న విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. అర్హత వయసును 15నుంచి 29 ఏళ్లుగా నిర్ణయించగా ఆయా రంగాల్లో ప్రవేశమున్న విద్యార్థులందరూ పాల్గొన్నారు. ఇందులో ప్రథమస్థానం పొందిన విద్యార్థులే ఈ మూడురోజుల రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో వారి ప్రదర్శనలిస్తున్నారు. మొత్తం 187మంది పాల్గొంటుండగా యువతులే అధిక సంఖ్యలో ఉండటం విశేషం. మొదటిరోజైన గురువారం మూడు వేదికలవద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో 71 మంది ప్రదర్శనలిచ్చారు. అత్యుత్తమ ప్రదర్శన చూపినవారికి 17వ తేదీన గచ్చిబౌలిలో జరగబోయే సాంస్కృతిక కార్యక్రమంలో బహుమతుల ప్రదానం జరుగుతుంది.

ప్రదర్శనలు ఏంటి..? 
ఆదిలాబాద్‌ నుంచి మొదలుకొని నిజామాబాద్‌, హైదరాబాద్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన యువకులు ప్రదర్శనలు ఇస్తున్నారు. కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ, ఎలక్యూషన్‌, శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, భరతనాట్యంతో పాటు సితార్‌, గిటార్‌, మృదంగం, హార్మోనియం, ఫ్లూట్‌ వాయిద్యాల పోటీ ఉంటుంది.

 

Related Posts