YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

30 నియోజకవర్గాలను ప్రభావితం చేయనున్న ఆంధ్రా ఓటర్లు క్యాంపెయినర్లుగా కవిత, కేటీఆర్, హరీష్ రావు

30 నియోజకవర్గాలను ప్రభావితం చేయనున్న ఆంధ్రా ఓటర్లు క్యాంపెయినర్లుగా కవిత, కేటీఆర్, హరీష్ రావు

ఒక్కటవుతున్న విపక్షాలను నిలువరించేందుకు తెలంగాణ రాష్ట్రసమితి ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేసింది. మూడు రకాలుగా దాడికి తయారవుతోంది. ఒకవైపు మచ్చిక చేసుకునే మాటలు, మరోవైపు సెంటిమెంటును రగుల్కొలిపే చేష్టలతో మహాకూటమిని మట్టికరిపించాలనే ఎత్తుగడ వేస్తోంది. ఘాటైన మాటల మంత్రంతో కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పటికే యుద్దబరిని తనదైన శైలిలో గీసేశారు. పందెంకోళ్ల తరహాలో కుటుంబ వారసులైన కేటీఆర్, హరీశ్, కవితలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం, కాంగ్రెసు,సీపీఐ, తెలంగాణ జనసమితుల కూటమిని ఎదుర్కోవడమనే కర్తవ్యాన్ని సమష్టిగా, విడివిడిగా నిర్వర్తించేలా ప్లాన్ రెడీ చేశారు. 30 నియోజకవర్గాల వరకూ ప్రభావం చూసే సీమాంధ్ర ఓటర్లను బుట్టలో వేయడమనేది ఒక లక్ష్యం. అదే సమయంలో స్థానికంగా తీవ్రమైన తెలంగాణ సెంటిమెంటుతో రగిలిపోయే ఓటర్లను సంఘటిత పరచడమనేది మరొక లక్ష్యం. ఈ రెంటిని సమన్వయం చేసుకుంటూ ముదుకు వెళ్లాలనే దిశలో పథక రచన చేస్తున్నారు. ప్రత్యర్థిపై విరుచుకుపడే విషయంలో హరీశ్ శైలి విభిన్నమైనది. ఎవరినీ లెక్కచేయని తత్వం తో దూసుకుపోతారు. ఇప్పటికే టీఆర్ఎస్ ను ఎందుకు ఎన్నుకోవాలనే విషయంలో ఓటర్లకు స్పష్టత నిస్తూ కేసీఆర్ ప్రసంగాలు చేశారు. పార్టీ పంథా అదే. ఎక్కడా కాంగ్రెసు, తెలుగుదేశాలను సహించేది లేదన్న రీతిలో ఆయన విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో నిర్వహించే సభల్లోనూ కేసీఆర్ అదే శైలిని కొనసాగిస్తారు. ఈ ధోరణికి అనుకరణగా , పార్టీ పంథాకు ప్రతిబింబంగా హరీశ్ రావు తన ప్రసంగాలను రూపొందించుకుంటున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు, సీపీఐ, తెలంగాణ జనసమితులను ఒకే గాటన కడుతూ కర్రుకాల్చి వాత పెట్టడమే ధ్యేయంగా ఆయన ప్రచారం సాగుతోంది. ప్రకటనలు, సభలు, ప్రసంగాల్లో తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొడుతూ ప్రజలను ఆకట్టుకోవడమనేది హరీశ్ సభల సారాంశం. తెలంగాణకు గత పాలకులైన కాంగ్రెసు, టీడీపీ నాయకులు చేసిన ద్రోహాన్ని ఎండగట్టడం ఆయన అజెండాలోని ప్రధానాంశం. అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమకూరిన ప్రయోజనాలనూ ఏకరవు పెడుతున్నారు. నీటిపారుదల మంత్రిగా భవిష్యత్తు బంగారుమయం కాబోతోందని భరోసానివ్వడమూ ప్రధానాంశమే.హరీశ్ శైలికి భిన్నంగా కొంతమేరకు ఉదారంగా తన వైఖరిని కనబరచాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ప్రధానప్రచారకర్తగా వ్యవహరించారు. అనూహ్యమైన విజయాన్ని పార్టీకి సాధించిపెట్టారు. సీమాంధ్రుల్లో ఆయన పట్ల కొంత సానుకూల వైఖరి ఉంది. దీనిని కొనసాగించడం ద్వారా వచ్చేఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తున్నారు. సీమాంధ్ర నుంచి వచ్చి తెలంగాణ లో స్థిరపడిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తే కష్టాలు తప్పవని టీఆర్ఎస్ కు తెలుసు. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించగల సంఖ్యలో సీమాంధ్రులున్నారు. ఆర్థికంగానూ స్థిరపడ్డారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో గెలవాలంటే వారి మద్దతు, తోడ్పాటు ఎంతైనా అవసరం. 2014లో బీజేపీ,టీడీపీ కాంబినేషన్ అధికసంఖ్యలో సీట్లు తెచ్చుకోవడానికి సీమాంధ్రులే కారణం. ఇప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు కలిసి ఆ విజయాన్ని పునరావ్రుతం చేసుకోవాలని చూస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే సీమాంధ్రులపై ప్రేమ కురిపించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తాము వ్యతిరేకం కాదని చెప్పాలి. ఈ బాద్యతను కేటీఆర్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడిని సైతం తీవ్రంగా వ్యతిరేకించకుండా మధ్యేమార్గాన్ని ఆయన అనుసరిస్తున్నారు. టీడీపీ ఏపీ కోసం కష్టపడాలి. టీఆర్ఎస్ తెలంగాణ కోసం క్రుషి చేస్తుంది. మధ్యలో జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బీజేపీల వల్ల నష్టం చేకూరుతుంది. అందువల్ల టీడీపీ కాంగ్రెసుతో కలవకూడదనే కొత్తవాదనను ముందుకు తెస్తున్నారు కేటీఆర్.లోక్ సభ సభ్యురాలిగా ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు గతంలో మద్దతు పలికారు కవిత. వాగ్ధాటి కలిగిన నాయకురాలిగా పేరుతెచ్చుకున్న కవిత ప్రస్తుతం పార్టీకి స్టార్ క్యాంపెయినర్. ఈ సారి వారసత్వ పోరులో లేకుండా ఆమె ప్రచారానికి పరిమితమవుతున్నారు. టీఆర్ఎస్ లో గ్రౌండ్ లెవెల్ లో ఉన్న అసమ్మతి వర్గాలను సమన్వయం చేసే బాధ్యతలను కేటీఆర్ చూస్తున్నారు. క్యాడర్ కు అవసరమైన సాధనసంపత్తి సమకూర్చే బాధ్యతను హరీశ్ చూస్తున్నారు. తెలంగాణ జాగ్రుతి ద్వారా బతుకమ్మ పండుగతో పాపులర్ అయిన కవిత సెంటిమెంటు అస్త్రంగా ఈ ఎన్నికలను మలుపు తిప్పాలని భావిస్తున్నారు. తెలంగాణలో కవితను ఆడపడుచుగా , తమ ఇంటి బిడ్డగా భావిస్తుంటారు. అంతగా పెనవేసుకుపోయారు. ఆ అనుబంధాన్నే ఆసరాగా చేసుకుంటూ అడుగులు కదుపుతున్నారు కవిత. 2014లో టీఆర్ఎస్ ను గెలిపించే ప్రధాన బాధ్యతను కేసీఆర్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన వ్యూహరచనలో ఎక్కువగా నిమగ్నమవుతున్నారు. తర్వాత తరం వారసులైన హరీశ్, కేటీఆర్, కవితలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యేక ఎత్తుగడలు, వ్యూహాలలో సైతం భిన్నమైన బాధ్యతలను వారికి అప్పగించడం విశేషం. ముందస్తు ఎన్నికల ఫలితాల్లో వీరికీ ఈసారి ప్రధానవాటా దక్కబోతోంది.

Related Posts