YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ విస్తృత సర్వే

12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ విస్తృత సర్వే

టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటి వరకూ ప్రకటించని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై విస్తృత సర్వే నిర్వహించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు టికెట్‌ను ఆశిస్తున్నందువల్ల వివిధ
అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక ప్రైవేటు సంస్థ ద్వారా మెరుగైన, బలమైన, దీటైన అభ్యర్థి ఎవరనేదానిపై పార్టీ సర్వే చేయించింది. ఒక్కో నియోజకవర్గంలో ఐదు వేల మంది శాంపిళ్ళతో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను వడపోత పోసింది. మరింత లోతుగా విశ్లేషించి నాలుగైదు రోజుల్లో ఈ పన్నెండు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించనుంది.
నియోజకవర్గంలో సరైన అభ్యర్థి ఎవరు, వారి సామాజికవర్గం, ఆ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు సామాజికవర్గానికి చెందినవారు, అభ్యర్థి పట్ల ప్రజల్లో ఉన్న పలుకుబడి, మంచి పేరు,
విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయి, పార్టీ లీడర్లు, కేడర్‌లో ఆ అభ్యర్థి పట్ల ఉన్న అభిప్రాయం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ఇప్పటివరకు ప్రజలకు చేరువయ్యేందుకు చేసిన సేవా
కార్యక్రమాలు.. ఇలా అనేక అంశాలపై ఆ సర్వే ద్వారా పార్టీ అధినాయకత్వం వివరాలను సేకరించింది. ఆ ఫలితాల ఆధారంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థి పట్ల స్పష్టమైన నిర్ణయానికి రాగా మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం లోతుగా విశ్లేషించి అంతిమంగా గెలవడానికి దోహదపడే అంశాలను అధ్యయనం చేస్తోంది.సర్వే ఫలితాల ఆధారంగా నాలుగైదు రోజుల్లో పార్టీ అధికారికంగా జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. నగరంలోని గోషామహల్‌లో ప్రేంసింగ్ రాథోడ్‌కు సర్వేలో మంచి ఫలితాలు వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా  తెలిసింది. దాదాపుగా ఈయన పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాత్రం ఇంతకాలం సిట్టింగ్ శాసనసభ్యురాలిగా ఉన్న బుడిగె శోభను మార్చక తప్పదనే అభిప్రాయం వెల్లడైనట్లు తెలిసింది. గెలిచే అభ్యర్థుల పేర్లను పరిగణనలోకి తీసుకున్న పార్టీ నాయకత్వం అభ్యర్థి ఖరారుపై దృష్టి సారించింది. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నందువల్ల ఆయనను ఢీకొట్టగలిగే బలమైన అభ్యర్థి కోసం టిఆర్‌ఎస్ నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న శంకరమ్మ పట్ల ప్రజల్లో సానుకూలత, సానుభూతి పుష్కలంగా ఉన్నప్పటికీ విజయావకాశం విషయంలో మాత్రం సర్వేలో అంతటి ధీమా రాలేదని తెలిసింది.పార్టీ నాయకత్వం కూడా శంకరమ్మ అభ్యర్థిత్వం పట్ల మొగ్గుచూపుతున్నప్పటికీ సర్వేలో ప్రతికూల ఫలితం రావడంతో మరో అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. శంకరమ్మకు మరో రకంగా గౌరవప్రదమైన అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన విజయావకాశాలు ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది. అభ్యర్థి విషయంలో మేయర్‌గా ఉన్న నన్నపనేని నరేందర్, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, మాజీ ఎంపి గుండు సుధారాణిలకు ప్రజల్లో మంచి గుర్తింపు, ఆదరణ ఉన్నట్లు తేలినందున ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇవ్వడం పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందనేదాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.. నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, అంబర్‌పేట, ముషీరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నల్లగొండ జిల్లాలోని కోదాడ, వికారాబాద్ స్థానాల విషయంలో కూడా సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయించి నాలుగైదు రోజుల్లో అధికారికంగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

Related Posts