YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆసక్తికరంగా మారిన టీటీడీపీ వైఖరి

 ఆసక్తికరంగా మారిన టీటీడీపీ వైఖరి

మహాకూటమిలో సీట్ల పంపకాలపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. ఏ స్థానం ఎవరికి దక్కుతుందో తేలకపోవడం, కుదిరిన పొత్తులంటూ లీక్‌లు వస్తుండడంతో మిత్రపక్షాల్లో లుకలుకలు మొదలవుతున్నాయి. మహాకూటమి తరుఫున పోటీ చేసేందుకు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీ నుంచి అనేకమంది పోటీ పడుతున్నారు. నగర శివారులోని 9 స్థానాల్లో ఈ రెండు పార్టీల నుంచి పలువురు టిక్కెట్లు ఆశిస్తున్నారు. సీట్ల పంపకాలపై ఈ రెండు పార్టీలు కుస్తీలు పడుతుండగా, కొన్ని స్థానాలపై సీపీఐ, టీజేఎస్‌ గట్టి పోటీపడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండడంతో మహాకూటమి తరుఫున పోటీకి సిద్ధమైన ఆశావాహులు సతమతమవుతున్నారు. కొన్నాళ్లుగా వారంతా నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టిన వారు తమ భవితవ్యంపై ఆందోళనతో ఉన్నారు. ప్రచారం ఆపేస్తే ఎక్కడ వెనుకబడిపోతామనే భావనతో నియోజకవర్గంలో ఇంకా ఖర్చుపెడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అవలంభిస్తున్న వైఖరి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పాటు రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలను కూడా మిత్ర పక్షాలకు వదులుకోవాలని చూడడాన్ని పార్టీలోని పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గట్టిగా పట్టుబడితే నచ్చిన స్థానాలను దక్కించుకోవచ్చని అధిష్ఠానానికి కొందరు సలహా ఇస్తున్నారు. మరికొందరు నేతలైతే అధినేత చంద్రబాబు నుంచి తమకు గట్టి హామీ ఉన్నా, పొత్తుల్లో ఎక్కడా ప్రస్తావన వస్తున్నట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కొందరు అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.  కాంగ్రెస్‌లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. పొత్తుల్లో మిత్రపక్షాలు అడుగుతున్న సీట్లపై కాంగ్రెస్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ బలంగా ఉన్న సీట్లను టీడీపీ కోరడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌కు చెందిన కొందరు ముఖ్య నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు సీట్లు ఇప్పించుకునే క్రమంలో సొంత పార్టీని దెబ్బతీస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి.

Related Posts