
- కేసులకు భయపడే చంద్రబాబు నిర్లక్ష్యం
- విభజన హామీల అమలుకు ఏం చేయబోతున్నారు?
కేంద్ర బడ్జెట్...కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై సంతృప్తిగా లేదని, కేంద్ర ప్రభుత్వంపై టిడిపి ప్రభుత్వం వత్తిడి తేలేదని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జగన్ ఎలా ఉంటారో స్పష్టం చేశారు. వామపక్షాలు బంద్ కు పిలుపునిస్తే తాము మద్దతు తెలియచేయడం జరిగిందన్నారు. టిడిపి డ్రామాల్లాగా చేయడం లేదని, ప్రధాన మంత్రి స్పీచ్ సమయంలో తమ సభ్యులు వాకౌట్ చేయడం జరిగిందన్నారు. బిజెపి పొత్తుకు తాము తహ తహ ఆడడం లేదని స్పష్టం చేశారు.
విభజన చట్టంలోని అంశాలను ఏ టైంలోపల పూర్తి చేస్తారో ప్రజలకు టీడీపీ సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మాటలు కట్టి పెట్టి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన హామీల సాధన కోసం పోరాడాలని హితవు పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తి కావడంతో అనుకూల మీడియాను అడ్డం పెట్టకుని టీడీపీ కొత్త నాటకాలకు తెరతీసిందని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ సమస్యల మీద ప్రశ్నిస్తే ప్రభుత్వం పొంతన లేని సమాధానాలు చెబుతోందని చెప్పారు. మాకు మాటలు కాదు చేతలు కావాలని పేర్కొన్నారు. చట్టంలో చేర్చిన 17 ప్రధాన సంస్థల ఏర్పాటుకు సుమారు 12వేల కోట్లు కావాలని కేంద్ర ఆర్థిక శాఖతోపాటు సంబంధిత శాఖలు చెప్పడం జరిగింది. అయితే కేవలం రూ. 626 కోట్లు కేటాయించి కేవలం రూ. 226 కోట్లు ఇచ్చారు. కేవలం పది శాతం కూడా ఇవ్వకపోతే మీరెందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మిత్రపక్షంగా ఉండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేకపోయారు. కేసులకు భయపడే.. విచారణకు ఆదేశిస్తారని ఆందోళనతోనే మీరు మాట్లాడలేకపోతున్నారని ప్రజలంతా చెప్పుకుంటున్నారని బొత్స పేర్కొన్నారు. హోదా ఇవ్వలేకపోవడానికి కారణం చెప్పమంటే మోకాలికి బోడి గుండుకి ముడిపెడుతున్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా.. పార్లమెంట్ లోపల ఆనాటి ప్రధాని.. ఈనాటి ప్రధాని ఇచ్చిన మాటలకు విలువ లేకపోతే రాజ్యాంగం అవహేళన అయినట్టు కాదా. కేంద్రం ఏర్పాటు చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నవే. కొత్తగా విభజన చట్టంలో ఉన్న హామీల ప్రకారం దక్కిందేమిటి. దీనిపైన ప్రశ్నిస్తే మమ్మల్ని అభివృద్ధి నిరోధకులమని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఏడు జిల్లాలకు కలిపి నాలుగేళ్లలో వెయ్యి కోట్లు కూడా సాధించలేకపోయారు.
పోలవరం ప్రాజెక్టు గురించి ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ఒక జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయడంపైన చిత్తశుద్ధి ప్రదర్శించకుండా రోజుకో కథలు అల్లుతున్నారు. తమ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి అనుకూల పత్రిల్లో కట్టుకథలు అల్లడం మొదలు పెట్టారు. అద్వానీని కలిసినట్టు.. వారి మధ్య జరిగిన సంభాషణపై రాసిన రాతలు చాలా అవహేళనగా ఉన్నాయి. మీరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి మేలు జరగాలన్న చిత్తశుద్ధితోనే వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధించడమే మా పార్టీ లక్ష్యం. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే రానున్న రోజుల్లో సీట్లు పెంచితే చాలన్నట్టుగా ఉంది. పోలవరం కట్టకపోయినా, రైల్వే జోన్ ఇవ్వకపోయినా, విభజన హామీలు నెరవేర్చకపోయినా ఫర్వాలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాయనాటకాలు కట్టిపెట్టి మాతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలి. ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.