YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కూటమి పార్టీల్లో కుంపటి..

కూటమి పార్టీల్లో కుంపటి..
మహాకూటమిలో పొత్తులు కొలిక్కి రాకముందే కూటమి పార్టీల్లో కుంపటి రేగింది. దాదాపు రెండు నెలల క్రితమే ఏర్పాటైనా.. కూటమి ఇప్పటి వరకు సీట్ల సర్ధుబాటు కొలిక్కి రాలేదు. దీంతో పొత్తులో భాగంగా తమ నియోజకవర్గం ఏ పార్టీకి పోతుందో తెలియని పరిస్థితి స్థానిక నేతలకు నెలకొంది. మహాకూటమిలోని పార్టీల మధ్య లొల్లి చాలదన్నట్లుగా సొంత పార్టీలోనే నేతలు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరుకుంది. టీపీసీసీతో చర్చలు విఫలమైన నేతలు హస్తినకు చేరుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గొడవ ఢిల్లీకి పాకింది. గత నాలుగురోజులుగా హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద దీక్షలు చేపట్టిన ఆశావహులకు తోడుగా ఇప్పుడు ఢిల్లీలో దీక్షలు ఊపందుకున్నాయి. టిక్కెట్లు దక్కవని అనుమానిస్తున్నవారు, కూటమిలో సీట్లు పోతాయని ఆందోళనచెందుతున్నవారు స్వరం పెంచడంతో గాంధీభవన్ రణరంగంలా మారింది. సొంత పార్టీలోని అర్హులైన నేతల నుంచి పోటీ.. ఇది చాలదన్నట్లు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నేతల ప్రచారంతో పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, వారి అనుచరుల ధర్నాలు, నినాదాలతో గాంధీభవన్‌ హోరెత్తుతోంది. ఇలాంటి పరిస్థితే ఓ మహిళా నేత విషయంలో జరుగుతోంది.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలకు టికెట్లు కేటాయించడంలేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆ నేతల్లో అలజడి మొదలైంది. ఇలాంటి వారిలో ప్రధానంగా ఇల్లందు నియోజవర్గానికి చెందిన హరిప్రియ పేరు వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన బానోతు హరిప్రియ నాయక్.. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత రేవంత్‌తో పాటు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కనకయ్య టీఆర్ఎస్‌లో చేరారు. నియోజకవర్గం నుంచి హరిప్రియ, చీమల వెంకటేశ్వర్లు, రాంచందర్‌నాయక్, ఊకే అబ్బయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు మొన్నటి వరకు పుకార్లు షికార్లు చేశాయి. ప్రస్తుతం హరిప్రియ, ఇటీవల టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఊకే అబ్బయ్య మధ్య వార్ రూంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. టికెట్ తమకు దక్కకపోతే రెబల్‌కైనా సిద్ధమంటూ హరిప్రియ వర్గం నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. హరిప్రియకే కేటాయించాలంటూ రేవంత్‌రెడ్డి వార్‌రూంలో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇల్లందు నుంచి కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందోననేది ఆసక్తికరంగా మారింది.

Related Posts