YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జేసీ కుటుంబానికి చెక్ పెడుతున్న తమ్ముళ్లు

జేసీ కుటుంబానికి చెక్  పెడుతున్న తమ్ముళ్లు
జేసీ దివాకర్ రెడ్డి… తిరుగులేని నేత. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం ఆయన చెప్పినట్లే నడిచింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆయనతో పడకపోయినా తాను అనుకున్నది సాధించుకున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ లో అప్రతిహతంగా కొనసాగిన జేసీ గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జేసీ తీసుకున్న ఈ నిర్ణయం కూడా కలసి వచ్చింది. జేసీ లాంటి పట్టున్న నేత పార్టీలోకి రావడంతో ఆయన కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా దివాకర్ రెడ్డిలు ఇద్దరూ విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ మాదిరిగానే తెలుగుదేశం లోనూ తమ హవా కొనసాగించాలనుకున్నారు. తాడిపత్రి వరకూ అయితే ఓకే… కానీ ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టడం స్థానిక ఎమ్మెల్యేలకు చికాకు తెప్పిస్తోంది. తొలుత అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పెట్టుకున్నారు జేసీ. అనంతపురం అభివృద్ధికి ప్రభాకర్ చౌదరి అడ్డుపడుతున్నారని పెద్దయెత్తున విమర్శలు కూడా చేశారు.ప్రభాకర్ చౌదరికి పోటీగా వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని తీసుకొచ్చారు. దీనిపై ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రిని చంద్రబాబునుకలసి తన పరిస్థితి ఏంటని కోరే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకు, జేసీ వర్గానికి పడటం లేదు. అలాగే మరో మంత్రి పరిటాల సునీత కుటుంబానికి, జేసీకి మధ్య కూడా సఖ్యత లేదు. అలాగే గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ తోనూ పొసగడం లేదు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఎక్కువ శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జేసీ అంటేనే కస్సుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాడిపత్రి నియోజకవర్గం వరకూ జేసీ బ్రదర్స్ హవా బాగానే ఉన్నప్పటకీ, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసరికి జేసీ ఫ్యామిలీకి చుక్కెదురయ్యేటట్లుంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జేసీ ఫ్యామిలీకి ఎంపీ టిక్కెట్ ఇవ్వవద్దని గట్టిగా చంద్రబాబును కోరే అవకాశమున్నట్లు చెబుతున్నారు. జేసీ మాత్రం తన కుమారుడుడ పవన్ రెడ్డిని ఎంపీగా బరిలోకి దింపాలని భావిస్తున్నారు. జేసీ ఒకవేళ పట్టుదలతో సీటు సంపాదించి తన కుమారుడిని ఎంపీగా పోటీ చేయించినా గెలుపు విషయం మాత్రం డౌటేనన్నది ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట. ఎందుకంటే జేసీ ఝలక్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు కాచుక్కూర్చుని ఉండటమే. జేసీకి కూడా ఈ విషయం తెలియంది కాదు. అయితే ఆయన భరోసా అంతా చంద్రబాబే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts