YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో మారుతున్న సమీకరణాలు పవన్ తో జత కట్టిన రవీంద్ర అనుచరుడు

 అనంతలో మారుతున్న సమీకరణాలు పవన్ తో జత కట్టిన రవీంద్ర అనుచరుడు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నందున అక్కడి పార్టీలు వేగం పెంచేశాయి. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ సారి కూడా అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే, గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ పార్టీ ఎంట్రీతో వచ్చే ఎన్నికల్లో త్రికోణ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో పాటు ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీతో విడిపోయిన తర్వాత మరింత స్పీడు పెంచాడు జనసేనాని. ఒకవైపు ప్రజాపోరాట యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూనే.. మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ పార్టీలక చెందిన సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది సీనియర్ నేతలతో పాటు, యువ నేతలు జనసేన తీర్థం పుచ్చుకోగా, మరికొందరు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.తాజాగా జనసేనలో మరో నేత చేరిపోయారు. ఆయనే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, పరిటాల రవీంద్ర అనుచరుడు రేగాటిపల్లి (చిలకం) మధుసూదన్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని చెప్పిన ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. అనుచరులంతా జనసేనలో చేరాలని సూచించడంతో, ఆయన సోమవారం అనంతపురం నుంచి నేరుగా కాకినాడ పర్యటనలో పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి మధుసూధన్‌రెడ్డిని.. పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఇందుకుగానూ వచ్చే ఎన్నికల్లో ఆయనకు జనసేన తరపున ధర్మవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వబోతున్నారని సమాచారం. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇప్పుడు ఈ స్థానాన్నే మధుసూదన్‌రెడ్డికి కేటాయించబోతున్నారట. అంతేకాదు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజుల్లో అనంతరపురంలో పర్యటించి, అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఈ టికెట్ గురించి అధికారికంగా ప్రకటించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts