YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పెద్ద పీట

రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పెద్ద పీట
అటు ఏపీలో, ఇటు టీఎస్‌లో కాంగ్రెస్‌కు కంచుకోటగా రెడ్డి సామాజికవర్గం ఉంటున్నదనే వార్త ఎప్పటినుంచో వింటున్నదే. ఇది తాజాగా మరోమారు నిరూపితమైంది. ఎట్టకేలకు తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాల్లో వారికి పెద్ద పీట వేశారు. 75 మందితో ఉన్న ఈ జాబితాలో 26 మంది రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులను ఉండటం గమనార్హం. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ చెప్పిన విధంగా దామాషా ప్రకారం తొలి జాబితాలో బీసీలకు ప్రాధాన్యం దక్కలేదని తెలుస్తోంది. దీంతో మహా కూటమిలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీ సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్య తెలంగాణ బంద్ పిలుపునిచ్చి మరో సంచలనం రేపారు. కాగా కాంగ్రెస్ పార్టీ వెలువరించే తదుపరి జాబితాలోనైనా బీసీలకు ప్రాధాన్యతనిస్తే రాహుల్ చెప్పిన మాట నిజమవుతుందంటున్నారు. ఇందుకోసం రెండో జాబితా వెల్లడయ్యే వరకూ వేచి చూడకతప్పదు. మరోవైపు కాంగ్రెస్ తొలి జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి పేర్లు లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికిలోనయ్యేలా చేసింది. అగ్ర వర్ణానికి చెందిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు ప్రాధాన్యతనిస్తూ బీసీ అయిన పొన్నాల లక్ష్మయ్యకు అన్యాయం చేయడమేమిటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.శశిధర్‌రెడ్డికి కూడా ఎందుకు మొండిచెయ్యి చూపారనేది ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. కాగా ఖైరతాబాద్‌ సీటు పి.విష్ణువర్ధన్‌రెడ్డికి ఇచ్చారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ భారీ కసరత్తు చేసిందని తెలుస్తోంది. అయితే మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎంతకీ తేలకపోవడంతో పరిష్కారం కోసం రాహుల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని సమాచారం. ఎట్టకేలకు ఎలాగోలా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. దీంతో కొంతమంది ఆశావహులు కంగు తిన్నారని సమాచారం. ఈ నేపధ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆశావహులు వారి అనుచరులు ఆందోళనలు చేపడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు, ఓడినవారు, మంత్రి పదవులు చేపట్టినవారిని ఎంపిక చేయడానికి ఇంత కసరత్తు అవసరమా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు తొలి జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Related Posts