YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెంపుకై రంగంలో దిగనున్న స్వచ్ఛంద సంస్థలు జీహెచ్ఎంసీలో మోడల్ పోలింగ్ కేంద్రం ప్రారంభించిన దానకిషోర్

 హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెంపుకై రంగంలో దిగనున్న స్వచ్ఛంద సంస్థలు జీహెచ్ఎంసీలో మోడల్ పోలింగ్ కేంద్రం ప్రారంభించిన దానకిషోర్
హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి 30కి పైగా స్వచ్ఛంద సంస్థలు, కళాజాత బృందాలచే నగరంలోని 15 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చైతన్య, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈవీఎం, వివిప్యాట్ల పనితీరుపై ఏర్పాటుచేసిన ప్రత్యేక మోడల్ పోలింగ్ స్టేషన్ను దానకిషోర్ నేడు ప్రారంభించారు. అడిషనల్ కమిషనర్ హరిచందన, కెనడి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, తెలంగాణ ఎలక్షన్ వాచ్ ప్రతినిధులతో కలిసి ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో 53శాతం నమోదు అయిన పోలింగ్ను ఈ డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో గణనీయంగా పెంపొందించడానికి విస్తృత ప్రచార, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దాదాపు 35కు పైగా స్వచ్ఛంద సంస్థలు అన్ని నియోజకవర్గాల్లో తక్కువ శాతం పోలైన ప్రాంతాల్లో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన ఓటింగ్ శాతాన్ని పెంచడానికి స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు మోడల్ పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్టు, ఈ మోడల్ పోలింగ్ స్టేషన్లలో అన్ని రకాల సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పించనున్నట్టు తెలియజేశారు. జిల్లాలో ఉన్న మొత్తం 3,856 పోలింగ్ కేంద్రాలను సూపర్వైజరీ అధికారులు స్వయంగా పర్యటించి కనీస మౌలిక సదుపాయల కల్పన, ఇతర సౌకర్యాలపై తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 17,18,19 తేదీలలో బూత్ స్థాయి అధికారులకు ఓటింగ్ శాతాన్ని పెంపొందించడం, ఓటర్లకు కనీస మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 23,000 మంది సిబ్బంది అవసరమని, వీరిని వివిధ శాఖల నుండి ఎంపికచేసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇప్పిస్తున్నామని అన్నారు. బాద్యతాయుత పౌరుడిగా ఉండడంతో పాటు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకుగాను ఎన్నికల విధులకు ఉద్యోగులు తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై ప్రజాప్రాతినిద్య చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలుకు చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగా సి-విజిల్ యాప్ ద్వారా అందిన 95 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు.

Related Posts