YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలి

కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలి
తానసలు మంత్రిని అవుతానని కూడా అనుకోలేదని, రాష్ట్రం కోసమే ఉద్యోగాన్ని వదులుకుని ఉద్యమంలోకి వచ్చానని  కేటిఆర్ అన్నారు. తాను కేసీఆర్ దయవల్లనే మంత్రిని అయ్యానని, తాను నిజాయతీగా చెబుతున్నానని, ఇంతకన్నా తనకు ఎటువంటి ఆశలు, దురాశలు లేవని అన్నారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడంతో గణనీయమైన అభివృద్ధిని సాధించామన్నారు. రాష్ట్ర ప్రగతి చక్రం ఆగొద్దంటే పని చేసే ప్రభుత్వం, నాయకుడిని ఆశీర్వదించాలి. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రపంచ మహాసభలు నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల నీలినీడల నుంచి ఆర్థిక, రాజకీయ స్థిరత్వం సాధించాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్లు ఆశ్చర్య పోయే విధంగా పాలన అందించాం. కేసీఆర్ ఉద్యమకారుడే కాదు.. మంచి పరిపాలకుడిగా నిరూపించుకున్నారు. విభజన సమయంలో లేవనెత్తిన అనుమానాలు.. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో నివృత్తి అయ్యాయి. తెలంగాణ నాయకులకు పరిపాలన చేయడం చేతకాదు అన్నారు. కానీ తల ఎత్తుకునేలా పరిపాలన చేసి నిరూపించాం.తెలంగాణ వస్తే చాలనే అనుకున్నాను కానీ.. మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. మంత్రి పదవే తనకు ఎక్కువ అనుకుంటా. ఇంతకంటే పెద్ద పదవులు చేపట్టాలన్న దురాశ కూడా లేదు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరిక తప్ప తనకు మరో కోరిక లేదన్నారు. కేసీఆర్ వంటి నాయకుడు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్ పార్టీ అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. టీఆర్‌ఎస్ సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మళ్లీ మీకు కనిపించను. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉత్తమ్‌కు, ఇతర నేతలకు ఉందా? కేటీఆర్ ప్రశ్నించారు.కేసీఆర్ వంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని, అటువంటి నేత ఉంటేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అటువంటి నేత కాకుండా, మరెవరైనా సీఎం కావాలని అనుకుంటే అది వెర్రితనమే అవుతుందని అన్నారు. పొరపాటున కూడా తనకు అటువంటి ఆశ లేదని స్పష్టం చేశారు. కనీసం మరో 15 ఏళ్లు ఆయనే సీఎం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతవరకూ తాను మంత్రిగా ఉన్నా సంతోషమేనని, లేకున్నా బాధపడబోనని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మూడు సార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు.. ఏనాడూ కూడా ఒంటరిగా గెలువలేదన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు అని కేటీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడు అని కేటీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు మాదిరిగా తమకు జబ్బలు చర్చుకునే అలవాటు లేదు. చార్మినార్‌కు తానే ముగ్గు పోశాను.. హైదరాబాద్ తానే కట్టాను అంటూ చంద్రబాబు చెప్పుకునే మాటలు విని ప్రజలు నవ్వుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను బేరీజు వేసుకొని ఓటు వేయమని అడిగామని ఆయన తెలిపారు. చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటే కేసీఆర్ పరిణతితో పనులు చేసుకున్నారని మోదీ కితాబిచ్చారు. తమ ప్రత్యర్థి ఇచ్చిన కితాబును చంద్రబాబులాగా ప్రచారం చేసుకునే అలవాటు తమకు లేదు. చంద్రబాబు సర్టిఫికేట్లు, రాహుల్ భుజకీర్తులు తమకు అవసరం లేదున్నారు  తెలంగాణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే పార్లమెంట్ వేదికగా చెప్పింది. 16 రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. నేత కార్మికుల ఆత్మైస్థెర్యం పెరిగేలా చేశాం. దివ్యాంగుల సంక్షేమంలోనూ ప్రథమ స్థానంలో నిలిచాం. 2004 నుంచి 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39.04 కోట్లు మాత్రమే. టీఆర్‌ఎస్ పాలనలో నాలుగేళ్లలోనే రూ. 2 వేల కోట్ల ఆదాయం వచ్చింది. భవిష్యత్ తరాల కోసమే మిషన్ భగీరథ, కాకతీయ చేపట్టాం. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా గణనీయంగా మెరుగైంది. భావితరాలకు కరెంట్ కట్ అనే పదం తెలియకూడదనే ఉద్దేశంతోనే 24 గంటల కరెంట్ సరఫరాకు శ్రీకారం చుట్టాం. 80 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేశాం. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. పరిపాలన సంస్కరణలతో ఆదాయం సృష్టించి సంపద పెంచగలిగాం. సులభతర వాణిజ్యంలో దేశానికే ఆదర్శంగా ఉన్నాం. 1956 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా మినహా ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పాటు కాలేదు. పరిపాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు పరిపాలన చేరువైంది. 3400 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దాం.. మోదీ మాకు రాజకీయ ప్రత్యర్థి. బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుంది. 100 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేసే పార్టీ టీఆర్‌ఎస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 7 సర్వేలు వచ్చాయి. అందులో ఆరు సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయి. డిసెంబర్ 11న అసలు సర్వే వస్తుందన్నారు కేటీఆర్.

Related Posts