YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లెక్క లేకుండాపోతన్న డబ్బు 76 కోట్లకు చేరిన సొమ్ము

లెక్క లేకుండాపోతన్న డబ్బు 76 కోట్లకు చేరిన సొమ్ము
ఎన్నికల సమయంలో అటు పోలీసులు, ఇటు ఆదాయం పన్ను శాఖ అధికారులు నానా హడావుడి చేస్తుండటం చూస్తుంటాం. వారు ముమ్మరంగా దాడులు చేసి డబ్బు, బంగారం మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంటుంటారు. ఇటువంటి కేసుల్లో సామాన్యులే ఇక్కట్లకు గురవుతుండటం కూడా తెలిసిందే. అయితే 2014 ఎన్నికలప్పుడు కానీ, తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోగానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిపై కేసులు రుజువుకాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఈనాటివరకూ మొత్తం రూ. 76.96 కోట్ల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.6 కోట్ల విలువైన మద్యం, నాలుగున్నర కోట్ల రూపాయల విలువచేసే బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దీనికితోడు వివిధ కేసులలో మొత్తం 3154 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇటువంటి కేసులకు సంబంధించి వివిధ జిల్లాల్లోని కోర్టుల్లో అక్కడి అధికారులు చార్జీషీటు దాఖలు చేయాల్సి వస్తుంది. కాగా ఇటీవల సూర్యాపేట పోస్టల్ డివిజన్‌లోని టేకుమట్ల సబ్-పోస్టాఫీసు నుంచి ఎల్కారం బ్రాంచి పోస్ట్ ఆఫీసుకు ఆఫీసు అవసరాలకు లక్ష రూపాయలను సంబంధిత సిబ్బంది తీసుకువెళుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అలాగే ఒక వ్యక్తి రూ. 20 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం అప్పుగా తీసుకుని, ట్రెజరీలో కట్టేందుకు హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వెళుతుండగా మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేవిధంగా బంగారు, వెండిని వ్యాపారం కోసం తీసుకువెళుతున్న వ్యాపారుల నుంచి ఆయా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న ఉందంతాలు వినిపిస్తున్నాయి. కాగా పెళ్లిళ్లు, భూములు, ఇళ్ల కొనుగోళ్లు, విక్రయాల సందర్భంగా నగదు చేతులు మారడం సాధారణమే. ఒక్కోసారి ఒకరి వద్ద అప్పు తీసుకుని వెళుతున్నపుడు వాటికి సంబంధించిన కాగితాలు ఉండకపోవచ్చు. ఇటీవలి ఇలాంటి కేసులే అధికంగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇవి కోర్టుల్లో తేలేందుకు చాలా కాలం పడుతుందన్నది తెలిసిందే. పేదలు, సామాన్యుల పరిస్థితి ఇటువంటి సందర్బాల్లో అగమ్యగోచరంగా మారుతుంది. ఏదీఏమైనప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు కానీ బంగారం మొదలైనవాటిని తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. తప్పనిసరి పరిస్థితిలో వీటిని తీసుకువెళితే పోలీసులు లేదా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. ఇంతజరుగుతున్నా ఇటువంటి కేసుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనీసం నిందితుడిగా కూడా ఉండకపోవడం గమనార్హం. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కి చెందిన ఒక కారులో కాలిపోయిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ కేసు ఏమైందో ఈ నాటికీ స్పష్టం కాకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts