YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డీకే అరుణ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు

డీకే అరుణ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు
టీఆర్ఎస్, మహాకూటమి మధ్య పోటీని అభివృద్ధికి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. గద్వాల జిల్లాలో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్ సభలో మహాకూటమి పార్టీలు, చంద్రబాబు నాయుడు, డీకే అరుణపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు పాలమూరు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చితే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందన్నారు. 2004లో నెట్టెంపాడుకు శంకుస్థాపన చేస్తే 2014 వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌తో కలిసి నడిస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని హరీశ్ రావు అన్నారు. పాలమూరు ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, చంద్రబాబుతో కలిసి వస్తున్న కూటమి పార్టీలను మట్టి కరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను నమ్ముకొంటే మళ్లీ చీకటేనని హరీశ్ అన్నారు. ‘పేదల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువండి. ప్రగతి పరుగులు పెడుతుంది. నెట్టెంపాడు కింద చెరువులు నింపిన ఘనత టీఆర్‌ఎస్‌దే. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే నెట్టెంపాడును పూర్తి చేసి లక్ష ఎకరాలకు పైగా సాగునీరు ఇస్తున్నాం’ అని హరీశ్ అన్నారు. 
మాజీ మంత్రి డీకే అరుణపై హరీశ్ విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు, అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌తో కిరికిరి పెట్టుకునే వాళ్లు మనకొద్దని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న డీకే అరుణ.. గద్వాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యకు సన్నిహితంగా కొనసాగిన డీకే అరుణ గద్వాలకు ఏం చేశారో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గద్వాల అభివృద్ధి చెందిదని అన్నారు. 

Related Posts