YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

26న పెన్నా గోదావరి అనుసంధానం శంకుస్థాపన

26న పెన్నా గోదావరి అనుసంధానం శంకుస్థాపన
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని రైతాంగానికి గోదావరి జలాలను అందించే లక్ష్యంతో చేపట్టిన గోదావరి -పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఏడు వేల క్యూసెక్కుల గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువలోకి మళ్లించే విధంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. గుంటూరు జిల్లా నకిరేకల్ వద్ద గోదావరి - పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రూ.6020 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ పథకాన్ని ఐదు దశల్లో పూర్తి చేస్తామన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 79 మండలాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రెండు జిల్లాలలోని రైతులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లుగా చెక్‌డ్యాంలు నిర్మించడంతో ఈ సంవత్సరం సాగర్ ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు అందడం లేదన్నారు. ఈ సమస్యలను అధిగమించి రైతాంగాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో గోదావరి -పెన్నా నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సంవత్సరం సాగర్ ఆయకట్టు కింద ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో 11లక్షల 90వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారన్నారు.రైతులు సాగుచేసిన పంటలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే ప్రకాశం -గుంటూరు జిల్లాల్లో 750 తాగునీటి చెరువులు కూడా సాగర్ నీటితో నింపామన్నారు. ఇప్పటివరకు సాగర్ నుంచి 70 టిఎంసిల నీటిని రైతాంగానికి అందించామని, మరో 21 టిఎంసిల నీరు రైతులకు అవసరం ఉంటుందని అధికారులు అంచనాలు వేశారని, ఈ నీటిని కూడా త్వరలో అందిస్తామన్నారు. ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా ఆదుకుంటామని రైతాంగానికి భరోసా ఇచ్చారు. వెలుగొండ మొదటి సొరంగం పనులు శనివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయని, పనులను పూర్తిస్ధాయిలో వేగవంతం చేసి 2019 ఫిబ్రవరి నాటికి వెలుగొండకు నీరు అందిస్తామన్నారు. రెండో సొరంగం పనులు కూడా మరో వారంరోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు రూ.5వేల కోట్లతో చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. దీనివలన 577 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. 5 లక్షల 12వేల 159 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు

Related Posts