YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

విజయవాడ బానిసలు మనకొద్దు

విజయవాడ బానిసలు మనకొద్దు
నిర్మల్ జిల్లా ఖానాపూర్లో  బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు  పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేసీఆర్ మాట్లాడుతూ 
తనను ఎదుర్కోలేని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబును భుజాలపై మోసుకుని వస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణపై అధికారాన్ని మరోసారి చంద్రబాబుకు అప్పగించాలా అని ప్రశ్నించారు. ‘కత్తిని ఆంధ్రావాడు ఇస్తాడు కానీ పొడిచేది మాత్రం మనోడే’ అని తాను గతంలో చెప్పాననీ, ఇప్పుడదే జరుగుతోందని వ్యాఖ్యానించారు.  ఎవర్ని గెలిపించాలో ప్రతి ఇంట్లో మాట్లాడుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలన్నారు. అనుకున్న అభివృద్ధి జరగాలంటే సరైన నాయకుడిని గెలిపించాలన్నారు. రాష్ట్రం బాగుపడాలని తపన పడే వ్యక్తిగా చెబుతున్నానన్నారు.  చంద్రబాబు పెత్తనం  వస్తే తెలంగాణ దరఖాస్తులను పట్టుకుని విజయవాడకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఓడిపోతే తనకు వచ్చే నష్టమేమీ లేదనీ, కానీ ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టవద్దని 35 లేఖలు రాసిన వ్యక్తి, ఇప్పుడు మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు కట్టనిస్తాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విజయవాడ బానిసలు, ఢిల్లీ గులాములు అవసరం లేదని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలు చూశారన్నారు. 58 ఏళ్లలో చేయని వాళ్లు ఇప్పుడు కిరీటం పెడతామంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును తాను ఓసారి తరిమేశాననీ, ఈసారి మాత్రం ఆ బాధ్యత తెలంగాణ ప్రజలదేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కరెంటు మోటార్లు కాలిపోయేవన్నారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని పుకార్లు పుట్టించారన్నారు. రూ.12వేల కోట్లు ఖర్చు చేసి 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాక ఖానాపూర్ సమస్యలను మొదటిసారి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ కు భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Related Posts