YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభివృధ్ది ఆమడదూరం

అభివృధ్ది ఆమడదూరం
పలు శాఖల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వివిధ పథకాల కింద ఏటా కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం ఫలితంగా పనులు సకాలంలో పూర్తికావడం లేదు. గడవు లోగా పూర్తి చేయకపోవడంతో నిర్దేశించిన లక్ష్యం నెరవేరక ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా మారుతోంది. దీనికితోడు రోజురోజుకు పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం ప్రభుత్వానికి అదనపు భారంగా పరిణమిస్తోంది. ఇందుకు నిదర్శనమే జిల్లా కేంద్రమైన చిత్తూరులో మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో మంగసముద్రం వద్ద రూ.10.15కోట్లతో నిర్మిస్తున్న నూతన మార్కెట్‌ యార్డు నిర్మాణం. కాంట్రాక్టర్ల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ఇష్టారాజ్యంగా మారింది..
చిత్తూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో నగర సమీపం మంగసముద్రం వద్ద సుమారు 25 ఎకరాల స్థలం ఉంది. అక్కడ రైతులు, వ్యాపారుల సౌకర్యార్థం ఒకే ప్రాంగణంలో బెల్లం, మామిడి కాయల యార్డును నిర్మించి ప్రస్తుతం కట్టమంచి వద్ద ఉన్న మామిడి మండీలను మంగసముద్రం యార్డుకు మార్పు చేయాలని అధికారులు తలచారు. మామిడికాయల మండీల స్థలంలో చర్చివీధిలోని నగరపాలక సంస్థ కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా చిత్తూరు నగరంలో కొంతవరకు ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని యోచించారు. నగరానికి దూరంగా ఒకే సముదాయంలో బెల్లం, మామిడికాయల యార్డుల నిర్మాణంతో రైతులు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందనే సంకల్పంతో మార్కెటింగ్‌శాఖ ఇంజినీర్లు అధునాతన విధానంలో నూతన యార్డు నిర్మాణానికి రూ.10.15కోట్ల వ్యయ అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తదనుగుణంగా ఆర్‌ఐడీఎఫ్‌ పథకం కింద గతేడాది నవంబరులో ప్రభుత్వం ఇందుకోసం నిధులు విడుదల చేసింది.
నూతన మార్కెట్‌ యార్డులో 70బెల్లం మండీలు.. 40మామిడి మండీలు.. కార్యాలయ భవనం, బ్యాంకు భవనం, రైతుల విశ్రాంతి గదులు, రక్షిత మంచినీటి ట్యాంకు.. సిమెంటు రోడ్లు, మరుగుదొడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలి. వ్యాపారులు, రైతులకు మూణ్నెలల్లో అందుబాటులోకి తేవాలన్నది ఆలోచన. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మించారు. అంతటితో వదిలేశారు. మిగిలిన పనులన్నీ నిలిచిపోయాయి. వాటిగురించి ఆలకించిన నాథుడే కరవయ్యాడు. పర్యవేక్షణ పూర్తిగా కొరవడటమే ఇందుకు కారణం. నిధులున్నా నిష్ప్రయోజనంగా మారింది.
నూతన మార్కెట్‌ యార్డు నిర్మాణానికి రూ.10.15కోట్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్‌ అధికారులు అభివృద్ధి పనులను ఐదుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. రెండు పనులకు టెండర్ల ప్రక్రియ నిర్ణీత గడవులోగా పూర్తయింది. మిగిలిన మూడు పనుల టెండర్లు నిర్దేశిత ప్రకారం పూర్తికాలేదు. అధికార పార్టీ నాయకుల మధ్యే విబేధాల కారణంగా ఒక పర్యాయం టెండర్లు రద్దయ్యాయి. రెండో దఫా టెండర్ల నిర్వహణ, గుత్తేదారులకు ఒప్పందాల ప్రక్రియలో ఇంజినీరింగ్‌ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు. ఫలితంగా పనుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి నెలలు గడుస్తున్నా నిర్మాణ పనుల్లో పురోగతి నామమాత్రమే. నిర్దేశిత మేరకు పనులు పూర్తయ్యేలా గుత్తేదారులపై ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరవైంది. పనులు ఎలా జరుగుతున్నాయి..? నెలకు ఎంత మేరకు పనులు జరగాల్సి ఉంది? ఎన్ని నెలల్లో పనులు పూర్తి చేయాలి..? పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఉన్నాయా? తదితర అంశాలను ఇంజినీరింగ్‌ అధికారులు గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. అసలు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఇక పనులు ఎప్పటికి పూర్తవుతాయనేది ఆ దేవదేవుడికే ఎరుక.
బెల్లం, మామిడికాయల మండీల నిర్మాణాలు మార్కింగ్‌లోనే ఉన్నాయి. మండీల షెడ్ల నిర్మాణాలకు మార్కింగ్‌ ఇచ్చి నెలలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కార్యాలయ భవనం, బ్యాంకు భవన నిర్మాణాలు నేటికీ ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి వీలైనంత త్వరగా నూతన యార్డు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

Related Posts