YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

22 గ్రామాలు ముంపు కష్టాలే

22 గ్రామాలు ముంపు కష్టాలే
గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో పరిహాసం చోటుచేసుకుంటోంది. కడప, అనంతపురం చిత్తూరు, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఉద్దేశించి నిర్మితమైన అతి పెద్ద ప్రాజెక్టు అయిన గండికోట పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పూర్తిస్థాయి నీటి నిల్వకు ముందే 22 గ్రామాలకు చెందిన 9096 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. కానీ గతేడాది మొదటి విడత కింద 14 గ్రామాల నిర్వాసితులకు రూ.409.46 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించారు. 1371 మంది నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడంతో ఆందోళన నెలకొంది. ఒక్కో నిర్వాసితునికి రూ.6.75 లక్షల చొప్పున సుమారు రూ.70 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయితొలి విడత కింద విడుదల చేసిన రూ.479.35 కోట్ల పంపిణీలో 1371 మంది నిర్వాసిత కుటుంబాలకు మొండిచేయి చూపడం ఆందోళన కలిగిస్తోంది. రెండో విడత కింద విడుదలైన రూ.198 కోట్ల చెల్లింపుల్లోనూ చేతివాటం చోటు చేసుకుంది. నిర్వాసితుల జాబితా వసూళ్ల ముఠా చేతికి చిక్కడంతో ఒక్కొక్కరి నుంచి రూ.2000 వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఎందుకివ్వాలని ప్రశ్నించిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని నిర్వాసితుల ఇళ్లను ఇష్టారాజ్యంగా కూలగొడుతున్నారు. పరిహారం చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొండాపురం నిర్వాసితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడుతున్నారు.ఏడాది నుంచి బాధిత నిర్వాసితులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండో విడత కింద ఎనిమిది గ్రామాలకు చెందిన నిర్వాసితులకు రూ.597 కోట్లను విడుదల చేస్తానని ఆగస్టు 25న ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో హామీని విస్మరించి రూ.198 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. రెవెన్యూ యంత్రాంగం పాతకొండాపురం, రామచంద్రనగర్‌, సిఎంఆర్‌ కాలనీల పరిధిలోని 3066 కుటుంబాలకు రూ.198 కోట్ల పరిహారం చెల్లింపుల ప్రక్రియ ఆగస్టు నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ 1700 కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇంకా 1366 కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. కొండాపురం మండల కేంద్రాన్ని ఆర్‌కె కొండాపురం, ఎన్‌.కొండాపురం ప్రాంతాలుగా విభజించారు. ఆర్‌కెను సబ్‌మెర్జ్‌డ్‌, ఎన్‌ఎస్‌ కొండాపురాన్ని నాన్‌ సబ్‌మెర్జ్‌డ్‌ కేటగిరీలుగా విభజించారు. ఆర్‌కె కేటగిరీలోని ఇళ్లు తక్షణమే ముంపునకు గురవుతాయనే ఉద్దేశంతో సత్వరమే పరిహారం చెల్లించాల్సి ఉంది. ఎన్‌ఎస్‌ కొండాపురం నాన్‌సబ్‌మెర్జ్‌డ్‌ కేటగిరీ కింద ముంపునకు సమీపంలో ఉంటాయని అంచనా వేసింది. విభజన అనంతరం మొదటగా ఆర్‌కె కేటగిరీలోని ఇళ్లను పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ చెల్లించలేదు. పరిహారం చెల్లింపుల ప్రహసనం నెలల తరబడి కొనసాగుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారుల సంబంధీకులు, ఇతరులతో కలిసి వసూళ్ల ముఠాల అవతారమెత్తారు. గండికోట నిర్వాసితుల జాబితాలోని బినామీలను గుర్తించి స్వాహా యత్నానికి పాల్పడడం మొదలుకుని ఒక్కో నిర్వాసితుని నుంచి రూ.2000 వరకు వసూళ్లు చేస్తున్నారు. రెండో విడత కింద మంపునకు గురవుతున్న గ్రామాల్లోని వందలాది ఇళ్లకు పరిహారం చెల్లించకుండానే కూల్చివేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి పరిహారం చెల్లింపులు పారదర్శకంగా చేసి, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మొదటివిడతలో రూ.6.75 లక్షలు చొప్పున మూడు చెక్కులను వి నారాయణరెడ్డి అనే రైతుకు రావాల్సి ఉంది. ఆయన ఎన్నోసార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అధికార పార్టీకి అనుకూలుడు కాదన్న ఉద్ధేశ్యంతో ఆయనకు చెక్కులివ్వకుండా జాప్యం చేశారు. 

Related Posts