YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పితానినే చెప్పారట... కాంగ్రెస్ తో పొత్తు పై క్లారిటీ

పితానినే చెప్పారట... కాంగ్రెస్ తో పొత్తు పై క్లారిటీ
తెలంగాణలో జరిగే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనా ప్రభావం చూపుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. కొద్దిరోజుల వరకు సాదాసీదాగా నడిచిన ఏపీ 
రాజకీయం.. టీడీపీ-కాంగ్రెస్ కలయికతో వేగం పుంజుకుంది. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్‌ను కలవడం చర్చనీయాంశం అయింది. ఆ భేటీ తర్వాత ఈ ఇరువురు నేతలు కలిసి 
మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ కలయిక అనివార్యమైందని, భవిష్యత్ తరాలను కాపాడడానికి ఈ కలయిక చారిత్రక అవసరం అని చెప్పుకొచ్చారు. దీనికి తగ్గట్టే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడం.. ఇంకా రావాల్సిన నిధులపై కొర్రీలు విధించడం వంటి వాటి వల్ల ప్రధాని మోదీని నిలువరించాలని 
అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అందుకోసమే జాతీయ స్థాయిలో ఇలాంటి పెద్ద కూటమిలో ఉండడం అనివార్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన అవసరం ఏర్పడింది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమే అంటూ కొందరు సమర్థిస్తుండగా, ఇతర పార్టీలకు చెందిన నేతలు వీరి కలయికపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా, ప్రజల్లో మాత్రం దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ మంత్రి దీనిపై కీలక విషయాన్ని బయటపెట్టారు. ఆయనే ఏపీ కార్మిక, పరిశ్రమలశాఖ మంత్రి పితాని సత్యనారాయణరావు. బీజేపీపై అవిశ్వాసం ప్రవేశపెట్టాక భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలిస్తే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని, ఆ పార్టీ అయితేనే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని తమ నాయకుడు చంద్రబాబుకు తొలుత చెప్పింది తానేనని ఆయన చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పెద్ద పార్టీలు రెండేనని, ఒకటి కాంగ్రెస్‌, రెండోది బీజేపీ కాబట్టి ఏపీని మోసం చేసిన బీజేపీ బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలో పెట్టిన పలు అంశాలను తామే నెరవేరుస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని, అందుకే తమ నాయకుడు మహా కూటమి ఏర్పాటు చేశారని పితాని వివరించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన పితాని.. ఆ పార్టీలో కీలక పాత్రలు పోషించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఇక 2014 ఎన్నికలకు ముందు సైకిల్ ఎక్కారు. ఆ ఎన్నికల్లో ఆచంట నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Related Posts