YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

చాపకింద నీరులా స్వైన్ ఫ్లూ

చాపకింద నీరులా స్వైన్ ఫ్లూ
రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. స్వైన్ ఫ్లూ పంజాతో రాష్టవ్య్రాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో మొక్కుబడిగా మందులు సరఫరా అవుతుండటంతో రోగులు ఇతర రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. నవంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్టవ్య్రాప్తంగా 325 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా, 65 మంది మృతి చెందారు. రాష్టవ్య్రాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక చోట ఈ కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూపై పెద్దగా అవగాహన లేకపోవడంతో వ్యాధి లక్షణాలు తొలిదశలో గుర్తించలేక ముదిరిపోయిన దశలో ఆసుపత్రులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనూ ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో గత రెండు రోజుల్లోనే 10 మందికి పైగా వ్యాధి అనుమానిత లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాల, గోరంట్ల జ్వరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో జిల్లాలోని బాపట్ల, మరో ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలకు వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. అలాగే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరుకు చెందిన బి సుబ్బాయమ్మ  వ్యాధి లక్షణాలతో మంగళవారం రాత్రి జీజీహెచ్‌కు వచ్చిన గంటలోపే మృతిచెందారు. రాష్ట్రంలోని గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు చిత్తూరులో 80 మందికి, విశాఖలో 70 మందికి, కర్నూలులో 55, విజయనగరంలో 20, గుంటూరులో 65 మంది, అనంతపురం 15, శ్రీకాకుళంలో 17 మందికి వ్యాధి లక్షణాలున్నాయని గుర్తించి ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధారణ జ్వరం, జలుబు ఉన్న వ్యక్తులు కూడా ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. చిన్నారులకు సైతం వైరస్ వ్యాపించడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత మందులు, అవసరమైన వసతులు లేకపోవడంతో, ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. విపరీతంగా ఆయాసం వస్తుంది. నాలుక, గోళ్లు నీలి రంగులోకి మారడం, ముక్కులో నుంచి నీళ్లు కారడం, దగ్గు ఎక్కువకావడం, కళ్లు బాగా ఎర్రబడటం. అదే విధంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఎక్కువగా మూడేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, గుండెజబ్బు, మధుమేహం, నరాల సంబంధిత సమస్యలు ఉన్న వారిపై వైరస్ అధిక ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. గాలిద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌లు ధరించడం, లక్షణాలను తొలిదశలోనే గుర్తించి తగు వ్యాక్సిన్ పొందాలని వైద్యవర్గాలు సూచిస్తున్నాయి.

Related Posts