YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీడీపీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్

 టీడీపీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్
ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం సీటను టీడీపీకి కేటాయించగా, ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి పోటీచేశారు. ఇదే స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి.. బీఎస్పీ నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి బరిలో ఉన్నారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంది. బీఎస్పీ అభ్యర్థికే కూటమిలోని పార్టీల కార్యకర్తలు మద్దతివ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోలింగ్‌కు కొద్ది గంటల ముందే పిలుపునిచ్చారు. ఉత్తమ్ పిలుపుతో టీడీపీ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యింది. అయితే ఆఖరి నిమిషంలో ఎందుకిలా జరిగింది..? కారణాలేంటి? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఇబ్రహీంపట్నం నుంచి టిక్కెట్ ఆశించిన కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరఫున పోటీచేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కూడా కాంగ్రెస్ నాయకుల ఫోటోలతో సాగింది. ఏనుగు గుర్తు తప్పా కాంగ్రెస్ జెండాలు, సోనియా, రాహుల్, ఉత్తమ్ ఫోటోలనే తన ప్రచార రథంపై ముద్రించారు. టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారనే ప్రచారం కూడా సాగింది. అయితే, చివరి వరకు ఉత్కంఠ కొనసాగినా ఆయన పోటీ నుంచి తప్పుకోలేదు. ఎల్బీనగర్ నుంచి టిక్కెట్ ఆశించిన సామ, ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేశారు. ఒక దశలో అధినేత చంద్రబాబును కలిసి తనకు ఎల్బీనగర్ సీటును ఇవ్వాలని కోరినా, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సర్దుకుపోవాలని ఆయన సూచించారు. ఇక, గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ నుంచి విజయం సాధించగా, ప్రధాన పార్టీలకు మల్‌రెడ్డి చెమటలు పట్టించారు. లగడపాటి సర్వేలోనూ మల్‌రెడ్డి విజయం సాధిస్తారని తెలిపారు. 

Related Posts