YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోహిని అవతారంలో శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో విహారం

మోహిని అవతారంలో శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో విహారం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం ఉదయం మోహిని అవతారంలో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు ఈ ఉత్సవం సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక రక్షణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యమోహినీ రూపంలో భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక అమ్మవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది అని ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి తెలిపారు.ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు.మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు అమ్మవారి ఆలయంలోని ముఖ మండపంలో వసంతోత్సవం వేడుకగా జరుగనుంది. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
గజవాహనంపై అమ్మవారు కనువిందు: 
రాత్రి 8.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు తనకు ప్రీతిపాత్రమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి పద్మావతి అమ్మవారు స్వర్ణ గజ వాహనంపై విహరిస్తుంది. గజపటాన్ని ఆరోహణం చేయడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలమేలు మంగ వాహనసేవలలో గజవాహన సేవ ఘనమైంది. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ''ఆగజాంతగం ఐశ్వర్యం'' అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు అమ్మవారు ఐదవ రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని ఆలయ అర్చకులు మణికంఠస్వామి తెలిపారు.వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌,  టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి , అదనపు సివి అండ్‌ ఎస్వో శ్రీశివకుమార్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి సుబ్ర‌మ‌ణ్యం,  ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Posts