తెలంగాణ ఎన్నికలుకు చంద్రబాబు ఫ్యూచర్ సంబంధం ఏమిటనే డౌట్ కదా... అవునండి... తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబుపై ఏపీలో నమ్మకం పెరుగుతుంది. లేకపోతే... పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న వ్యూహం దెబ్బతింటుంది. దాదాపు 20 రోజుల పాటు కోలాహలంగా జరిగిన తెలంగాణా ఎన్నికల సంరంభం శుక్రవారంతో ముగిసింది. హేమా హేమీలు తలపడిన ఈ ఎన్నికల్లో అధికారం రెండు వర్గాల్లోనూ దోబూచులాడేలా చేసింది. నేషనల్ ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కూడా కేసీఆర్‌కు ఆయన బృందానికి అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించాయి. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని దాదాపు నేషనల్ సర్వేలు అన్నీ ప్రకటించాయి. దీంతో ఒకింత మహాకూటమిలో ఆందోళన మొదలైంది. అయితే,ఇంతలోనే మీడియా ముందుకు వచ్చిన ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్… ఈ ట్రెండ్‌ను అనూహ్యంగా మార్చేశాడు. మహాకూటమిదే అధికారం అని తేల్చేశాడు. అదేసమయంలో టీడీపీకి 12 స్థానాల్లో 7 చోట్ల విజయం ఖాయమని చెప్పాడు.ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై వాతావరణం. ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని.. మరింత ఉత్కంఠలోకి నెట్టేసింది. కట్ చేస్తే.. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్రంలో కన్నా కూడా ఏపీలోనే ఎక్కువ చర్చ సాగింది. తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి వస్తే.. ఏపీలో చంద్రబాబుకు తిరుగు ఉండదనే విషయాన్ని ఎక్కువగా చర్చించారు. తెలంగాణాలో మహాకూటమిగా కాంగ్రెస్-టీడీపీ-సీపీఐ-తెలంగాణా జనసమితులు పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, వీరందరిలోనూ చంద్రబాబుకే ఎక్కువ మైలేజీ వచ్చింది. ఆయనే మహాకూటమి రూపశిల్పిగా ప్రచారం జరిగింది. దీంతో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రజలు ఇక్కడ ప్రత్యేక హోదదా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. హోదా పైనే తొలి సంతకం చేస్తామని ప్రకటించారు. అదేసమయంలో చంద్రబాబు కూడా ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య మార్పుకోసం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను కాంగ్రెస్‌తో జట్టుకట్టానని చెప్పారు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యాఖ్యలను నిజం చేసుకోవాలన్నా.. కూడా తెలంగాణాలో ఈ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇక, ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అందుకోనున్న నినాదం కూడా ప్రత్యేక హోదా-అబివృద్ధి-మోడీ వ్యతిరేక ప్రభుత్వం. మూడు విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లి గెలుపు గుర్రం ఎక్కాలంటే కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థాయిలో చంద్రబాబు ఉండాలి. అంటే.. కేంద్రంలో ప్రధానిని తన మాటలతో ఒప్పించగలిగేంత చనువు ఉండాలి. మరి ఇవన్నీ సాకారం కావాలంటే.. తెలంగాణాలో మహాకూటమి విజయంపైనే ఆధారపడి ఉన్నాయనేది విశ్లేషకుల మాట. తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి రాకపోతే.. చంద్రబాబు చెప్పిన వన్నీ ప్రజలు నమ్మడం చాలా కష్టం. అంతేకాదు, ఏకంగా కాంగ్రెస్‌కు టీడీపీకి మధ్య బంధం కూడా తెగిపోయే సూచనలు ఉన్నాయి. ఇక, కేంద్రంలో తాను చక్రం తిప్పుతాననే వ్యాఖ్యలకు కూడా చంద్రబాబు దూరం కావల్సి ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసినా.. ఏపీలో చంద్రబాబు హవాపై తెలంగాణా ఎన్నికల ఫలితం రిఫ్లెక్ట్ అవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.