YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్షానికి అతలాకుతలం

వర్షానికి అతలాకుతలం
తీవ్ర తుఫానుగా మారిన పెథాయ్‌‌ ప్రస్తుతం కాకినాడ‌కు 120 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తీరం వైపునకు వేగంగా క‌దులుతోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు తాళ్లరేవు- తుని మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో, తుఫాను తీరం దాటే సమయంలో గంట‌కు 90 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక, పెథాయ్‌ తుఫాను ప్రభావం తూర్పు గోదావరి జిల్లాపై తీవ్రంగా ఉంది. కాకినాడ తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి కోనసీమ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. అమలాపురం డివిజన్‌లోని 16 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్రేయపురం మండలంలో అత్యధిక 32 మీల్లీమిటర్లు వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా అంబాజీపేట మండలంలో 16.4 శాతం నమోదైంది. కాగా, అమలాపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో కాసేపట్లో కుండపోత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పెథాయ్‌ తుఫానుపై అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా తెలిపారు. తుఫాను తాళ్లరేవు, యానాం మధ్యలో తీరం దాటనుందని పేర్కొన్నారు. 14 మండలాల్లో 5500 మందిని సహాయక కేంద్రాలకు తరలించామని మొత్తం 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఐ.పోలవరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలియజేశారు. తుఫాను ప్రభావంతో కాకినాడ సమీపంలో యానాంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు చెట్లు విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీర ప్రాంతాల్లో పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారపదార్థాలను పంపిణీ చేశారు. మరోవైపు తుఫాను సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు పుదుచ్చేరి నుంచి ఇద్దరు ఐఏఎస్‌లు యానాం వచ్చి పరిస్థితి సమీక్షిస్తున్నారు. 

Related Posts