YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ 2.0

టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ 2.0
ముందస్తు ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు సాధించిన టీఆర్‌ఎస్‌, మరోసారి రాజకీయ క్రీడకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. కొత్త అసెంబ్లీ సాంతం తన చెప్పుచేతల్లో నడిచేలా వ్యూహరచనకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అవసరమైన పావులను కదుపుతున్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు పదవులు, నిధులు ఎరవేసి గతంలో రాజకీయశక్తుల పునరేకీకరణ పథకాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నది. తాజాగా రాజకీయశక్తుల పునరేకీకరణ పేర ఎపిసోడ్‌-2ను ప్రారంభించినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలే చెబుతున్నాయి. 119 ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 88 స్థానాలున్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి కోసమంటూ ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కారు బలం 90కి చేరింది. కాగా సభలో కాంగ్రెస్‌ 19, టీడీపీ 2, ఎంఐఎం 7, బీజేపీ ఒక ఎమ్మెల్యేను కలిగి ఉన్నాయి. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌, టీడీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, నిధులు, ఇతర కార్పొరేషన్ల చైర్మెన్ల పదవులను ఆశ చూపి బలం పెంచుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో 63 సీట్లు ఉండగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో 93కు బలం పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరోసారి తన రాజకీయ చతురతను చాటాలని భావిస్తున్నది. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన జూనియర్‌ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు, సీనియర్లకు మంత్రి పదవులు ఎరగా వేస్తున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ పోస్టులు ఉండవంటూ ఇటీవల ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ నుంచి కారెక్కిన వారికి మాత్రం కార్పొరేషన్‌ చైర్మెన్‌ పదవులను కట్టబెట్టేందుకు సై అంటున్నదనే ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల ముందు టీడీపీ నుంచి రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేల్లో ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. సరైన ప్రతిపాదన అధికార పార్టీ నుంచి వస్తే జంప్‌ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నవారూ ఉన్నట్టు సమాచారం. అంతేగాక మాజీ మంత్రి అయిన రంగారెడ్డి జిల్లా సీనియర్‌ ఎమ్మెల్యేపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తన కుటుంబ సభ్యుడికి చేవెళ్ల ఎంపీ సీటుతోపాటు తనకు మంత్రి పదవి హామీ ఇస్తే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడానికి ఆలోచిస్తానని అంతర్గత చర్చల్లో అన్నట్టు సమాచారం. అయితే సదరు ఎమ్మెల్యే పార్టీ మారే విషయాన్ని ఖండిస్తున్నారు కూడా. రాజకీయశక్తుల పునరేకీకరణ పేరుతో ఎపిసోడ్‌-1లో సంప్రదింపులు చేసిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి, మరోసారి ఎపిసోడ్‌-2 పేర చక్రం తిప్పుతున్నారనే ప్రచారం కూడా తెలంగాణ భవన్‌లో జరుగుతున్నది. అంతేగాక కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వచ్చిన ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.చావైనా, బతుకైనా కాంగ్రెస్‌లోనే అని ఇటీవల వ్యాఖ్యానించిన ఓ ఎమ్మెల్యేపై కూడా టీఆర్‌ఎస్‌ ఒత్తిడి పెంచినట్టు తెలిసింది. 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తున్నదని తెలిసింది. సాధ్యమైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో లాగి, కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాకు గండికొట్టాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం స్థానాల్లో నుంచి 10 శాతం సీట్లు వస్తే ఆ హోదాకు అర్హత వస్తుంది. అంటే 12 సీట్లు ఉంటే చాలు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 19 స్థానాలున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ మాత్రం కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకుండా పావులు కదుపుతున్నదే ప్రచారం ఇటు గాంధీభవన్‌, అటు తెలంగాణ భవన్‌లో చోటుచేసుకుంటున్నది.

Related Posts