YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మళ్లీ తెరపైకి కాళేశ్వరం జాతీయ హోదా అంశం

మళ్లీ తెరపైకి కాళేశ్వరం జాతీయ హోదా అంశం
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని రాజకీయ ఎజెండాగా చేసుకుని కేంద్రంపై పోరాటానికి టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతున్నది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ అంశంపై పట్టుపట్టాలని పార్లమెంట్‌ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ఇటీవల దిశా నిర్దేశం చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలూ రాలేదని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి మేఘావాల్‌ గత పార్లమెంట్‌ సమావేశాల్లో స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.రీడిజైన్‌ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 82,000 కోట్లకు పెరిగింది. ఇది రూ. లక్ష కోట్లకు చేరే అవకాశం ఉన్నదని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం 50 శాతం పైగా పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కాళేశ్వరం వ్యయం పోలవరం కన్నా రెట్టింపు కావటం విశేషం. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే నాటికి ఈ ప్రాజెక్టు వ్యయం కేవలం రూ. 16,000 కోట్లు మాత్రమే. సవరించిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం కూడా రూ. 44,000 కోట్లకు చేరింది. వ్యయ అంచనాల ప్రకారం దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా భావిస్తున్న కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర జలసంఘం అధికారులు ఇప్పటికే అనేక మార్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులకు తెలిపారు. జాతీయ హోదాపై ఆశ వదులుకున్న రాష్ట్ర సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నది. జాతీయ బ్యాంకుల కన్సార్టియం నుంచి మొదటి దశలో రూ. 20,000 కోట్లు రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. నీటిపారుదల శాఖ బడ్జెట్‌లో కూడా ఈ ప్రాజెక్టుకే అధికంగా కేటాయింపులు చేస్తూ వచ్చింది. కేంద్రం ఆర్థిక సహాయం చేసినా చేయక పోయినా స్వంతంగానే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ కేవలం వ్యూహాత్మంగా జాతీయ హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నట్టు స్పష్టమవుతున్నది.  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖ కాపీని కూడా విడుదల చేసింది. రాష్ట్ర పునర్విభజ సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వటానికి కేంద్రం అంగీకరించింది. ఈ అంశాన్ని పునర్విభజన చట్టంలో కూడా పొందుపరిచారు. తెలంగాణలో కూడా ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని టీఆర్‌ఎస్‌ కోరినప్పటికీ దీనిపై ఎటువంటి ఒత్తిడీ పెంచక పోవటంతో బిల్లులో ఈ అంశాన్ని చేర్చలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేక పోయింది. జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శక సూత్రాలకు లోబడి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయాల్సి ఉంది. కాళేశ్వరం, లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాలని రాష్ట్ర ప్రభుత్వం మొదటి భావించింది. అంతరాష్ట్ర నదీ జలాల వివాదంలో చిక్కుకున్న పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వటం సాంకేతికంగా కష్టమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకే హోదా సంపాదించాలని నిర్ణయించింది. రీడిజైన్‌లో భాగంగా కాళేశ్వరం స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయటం, అదనంగా మూడు బ్యారేజీలు, పది బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు కొత్త డిజైన్‌లో చేర్చటంతో దీనికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవటానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది. ఇదే సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప దేశంలో ఏ ఒక్క భారీ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించింది. వివిధ సాంకేతిక కారణాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించటం కష్టమేనని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే కేంద్ర జలసంఘానికి పూర్తి స్థాయి ప్రతిపాదనలు పంపించ లేదు. జాతీయ హోదా వ్యవహరాన్ని కేవలం రాజకీయ అంశంగా అప్పుడప్పుడు తెరపైకి తీసుకురావటం మినహా దీనిపై ఎటువంటి పోరాటం చేయలేదు. 

Related Posts