YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీలకు ఎన్నికలకు అంతా సిద్ధం 3 కోట్ల బ్యాలెట్ పేపర్లు

పంచాయితీలకు ఎన్నికలకు అంతా సిద్ధం 3 కోట్ల బ్యాలెట్ పేపర్లు
పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని విధాలుగా సిద్ధమైంది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయింది. వార్డు మెంబర్లు, సర్పంచ్ ఎన్నికకు వేర్వేరు రంగుల్లో విడివిడి బ్యాలట్ పేపర్లను ముద్రించింది. నామినేషన్ల ప్రక్రి య ప్రారంభం కాకున్నా, పోటీచేసే అభ్యర్థులు ఎంత మందో తెలియకున్నా సరిసంఖ్యలను పరిగణనలోకి తీసుకుని ముద్రించింది.జనవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పోలింగ్ నిర్వహణ అధికారులు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సుల తరలింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ వంటి ఏర్పాట్లు గతంలోనే పూర్తి చేశారు. తాజాగా ఈ ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయా అనే అంశంపై జిల్లా అధికారులను సంప్రదించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేజ్-1లో ఒకరు, స్టేజ్-2లో మరొకరు రిటర్నింగ్ అధికారులను నియమిస్తున్నారు. నాలుగు, ఐదు గ్రామ పంచాయతీలకు కలిపి స్టేజ్-1 రిటర్నింగ్ అధికారి ఉంటారు. ఆయా గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం.. నామినేషన్లు స్వీకరణ.. పరిశీలన.. ఉపసంహరణ.. బరిలోఉండే అభ్యర్థుల తుది జాబితా.. గుర్తుల కేటాయింపు.. వంటి బాధ్యతలు స్టేజ్-1 అధికారులు నిర్వర్తిస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫలితాల ప్రకటన వంటి అంశాలు స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల పరిధిలో ఉంటాయి బ్యాలట్ పేపర్పై అభ్యర్థి పేరుకు బదులుగా క్రమ సంఖ్య, వారికి కేటాయించిన గుర్తు మాత్రమే ఉంటుంది కాబట్టి ముందుగా ముద్రించడానికి ఇబ్బందులేమీ లేవని వివరించారు. ఏడుగురు అభ్యర్థులు పోటీచేస్తున్నచోట ఎనిమిది మంది అభ్యర్థులతో ముద్రించిన బ్యాలట్ పేపర్ను వినియోగించి ఎనిమిదవ అభ్యర్థి ముద్రణ అయిన భాగాన్ని చించి వేస్తామని వివరించారు. దాదాపు మూడు కోట్ల బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘంలోని ఓ అధికారి పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో లేని ‘నోటా’ విధానాన్ని ఈసారి చేరుస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల కోసం లక్ష బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకుని జిల్లాలకు పంపామని, ప్రస్తుతం జిల్లా అధికారుల పర్యవేక్షణలో అవి భద్రంగా ఉన్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల విషయంలో కొరత లేకుండా అదనపు ఏర్పాట్లు కూడా చేసి పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం దగ్గర తగినంత సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు లేనందువల్ల కర్నాటక, మహారాష్ట్రల నుంచి కూడా తెప్పించినట్లు వివరించారు. పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించడంలో భాగంగానే ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆ అధికారి ‘మన తెలంగాణ’కు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ మాదిరిగానే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఆ ఎన్నికలకు ఉన్న తుది, అదనపు ఓటరు జాబితాలే పంచాయతీ ఎన్నికలకు అందుబాటులో ఉంటాయన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఖర్చులను కూడా లెక్కిస్తామని, వారు కూడా నేర చరిత్ర ప్రకటించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.ఆఫిడవిట్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. కొత్త గ్రామా పంచాయతీలతో కలిపి రాష్ట్రం మొత్తం 12,751 ఉన్నాయి. ఇందులో 12,734 పంచాయతీలకు, 1,13,354 వార్డులకు జనవరిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 17 గ్రామాలలో ఇంకా సర్పంచ్ల పదవీ కాలం ముగియకపోవడంతో వాటికి సమయనుగుణంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆదిలాబాద్లో రెండు, మంచిర్యాల్లో మూడు, మహబూబ్నగర్లో రెండు, సూర్యాపేటలో 7, రంగారెడ్డిలో రెండు, వరంగల్ అర్బన్ ఒక గ్రామ పంచాయతీలు, వార్డులకు ఇంకా పదవీకాలం ముగియలేదు.

Related Posts