YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాలం కలిసిరాక...

కాలం కలిసిరాక...
మద్దతు ధర ఎక్కువ ఉండడంతో తెలంగాణ రైతులు పత్తి పంటనే అధికంగా సాగు చేశారు. కష్టనష్టాలకోర్చి.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని పంట పండించారు. అయినప్పటికీ పత్తిరైతుకు కష్టానికి తగ్గ ఫలం చేతికందే మార్గం కనిపించడంలేదన్న వ్యాఖ్యలు మంచిర్యాల జిల్లాలో వినిపిస్తున్నాయి. పంటలు వేసిన మొదట్లోనే భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో దిగుబడి క్షీణించింది. ఖరీఫ్‌ ఆరంభంలో వర్షాలు బాగానే కురిసినా ఆతర్వాత వాటి జాడలేని పరిస్ధితి. దీంతో సాగునీటికి సమస్య ఏర్పడింది. మొత్తంగా ఒకే నెలలో భిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట ప్రభావితమైంది. ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సిన చోట ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చిందంటే రైతుకు ఎంతటి నష్టం వాటిల్లిందో సులువుగానే అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో కొన్నిచోట్ల పత్తి చేలు బీడు వారాయి. పత్తి పై పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టిన తమ ఆశలు నీరుగారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంట దిగుబడి సరిగా లేకపోవడంతో పలువురు రైతులు మార్కెట్ యార్డులకు సైతం పంటను తీసుకురావడం లేదనే మాట అధికారుల నుంచి వినిపిస్తోంది. వాస్తవానికి ఏటా పత్తి రైతులకు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రతికూల వాతావరణం, తెగుళ్లుతో పాటూ మద్దతు ధరలు క్షీణించడం రైతుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ దఫా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చొరవతో మంచి ధర దక్కుతుందనుకున్నా ప్రతికూల వాతావరణం వల్ల రైతులకు నిరాశే ఎదురైంది.  
కాలం కలసిరాక, మార్కెట్ ధరల్లో స్ధిరత్వం లేక పత్తి రైతులు ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కొందరికైతే పెట్టుబడి ఖర్చు కూడా దక్కని దుస్థతి. మళ్లీ పంట వేయాలంటే అధిక వడ్డీలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. దీంతో రైతులు అప్పుల  ఊబిలోనే కరుకుపోతున్నారు. ఈ సమస్య నుంచి తేరుకోవడం వారికి కష్టంగానే మారింది. సాగు పెట్టుబడి పెరగడంతో పాటూ గతంతో పోల్చితే క్రిమిసంహారక మందులు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. వీటన్నింటినీ పరిగణిస్తే ఒక్కో పత్తి రైతు ఎకరాకు రూ.10 వేలకు పైనే ఖర్చుచేయాల్సి వస్తోంది. ప్రభుత్వాలు మద్దతు ధర పెంచినా ఆర్ధికంగా నిలదొక్కుకునే పరిస్థితి ఉండడంలేదని కొందరు రైతులు అంటున్నారు. మళ్లీ సాగు ప్రారంభించేందుకు, కుటుంబపోషణకు ఈ సొమ్ము సరిపోవడం లేదని చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ పత్తి రైతుల పరిస్థితి ఆశాజనకంగా లేదు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు గతేడాది 10.68 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చింది. ఈసారి మాత్రం 4.80 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పత్తి తక్కువ రావడంతో మార్కెట్‌ ఆదాయం కూడా తగ్గింది. ఏదేమైనా పత్తి రైతుల సమస్యలు గుర్తించి ప్రభుత్వం వారికి చేయూతనివ్వాలని అంతా కోరుతున్నారు.

Related Posts