YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బాబోయ్ చలి..

బాబోయ్ చలి..
పెథాయ్‌ తుపాను ఎఫెక్ట్‌తో కుమురంభీమ్ జిల్లాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి తీవ్రంగా ఉంది. అసలే శీతాకాలం..ఉన్నట్టుండి విరుచుకుపడ్డ తుపాను.. మొత్తంగా జనాలు వణికిపోతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్నారు. ఈ చలి చాలదన్నట్లు ఈదురుగాలులు, వర్షాలు కూడా కురవడంతో అంతా నానాపాట్లు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే చల్లటి వాతావరణం ప్రతి ఒక్కరికీ సమస్యగానే మారింది. రెండు రోజులుగా ఎండే లేని పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు కనిపించకపోవడం.. ఆకాశమంతా మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుడటం వర్షాకాలాన్ని తలపిస్తోందని జిల్లావాసులు అంటున్నారు. వర్షం, చలికితోడు ఈదురు గాలులు జతకావడంతో ప్రజలు బయట అడుగు పెట్టలేకపోతున్నామని చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కూడళ్లు, రచ్చబండలు బోసిపోయాయి. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఏ నలుగురు కలిసినా చలిమంటలు వేసుకుంటున్నారు. కొన్నిప్రాంతాల్లో అయితే సంక్రాంతి పండగకు ముందుగానే బోగిమంటల దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నిజానికి రెండు వారాలుగా చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. చలిని తట్టుకునే వస్తాలు, ఇతర రక్షణ కవచాలు లేనిదే ఎవ్వరూ బయట అడుగుపెట్టడడంలేదు. ఇలాంటి తరుణంలో పెథాయ్‌ తుపాను రావడంతో జనాలు గజగజ వణికిపోతున్నారు. 
వర్షం అంతగా లేకున్నా ఈదురు గాలులు భయభ్రాంతులకు గురి చేశాయి. గతంలో ఎన్నడు లేనట్లుగా సూర్యుడు మబ్బుల నుంచి బయటకు రాకపోవడంతో జనాలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. రాష్ట్రంలోనే ఆదివారం అత్యల్పంగా 6.4 కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈదురు గాలులు, చిరుజల్లులు, చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర పనులకు తప్పితే బయటకు జనాలు రాలేకపోవడం చలితీవ్రతకు నిదర్శనం. చలి నుంచి రక్షణ పొందేందుకు జనాలు వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమైన శీతగాలులు కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని నిలిచే పల్లెవాసులు సైతం పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో రచ్చబండలు బోసిపోయాయి. ఎముకలు కొరికే చలిలో రచ్చబండ వద్దకు రావడానికి ఏ ఒక్కరూ కూడా సాహసం చేయలేదు. ఇంటివద్దనే చలిమంటలు కాగుతుండటం చూస్తుంటే సంక్రాంతి భోగి మంటలను తలపిస్తోంది.  

Related Posts