YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆర్నెల్లలో దేవాదుల ద్వారా జనగామలోని ప్రతి చెరువుకు నీరు ఎన్నికల ఫలితాలతో నేతలు, కార్యకర్తల్లో అహంకారం రావొద్దు

ఆర్నెల్లలో దేవాదుల ద్వారా జనగామలోని ప్రతి చెరువుకు నీరు     ఎన్నికల ఫలితాలతో నేతలు, కార్యకర్తల్లో అహంకారం రావొద్దు
పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మొన్నటి ఎన్నికల ఫలితాలతో నేతలు, కార్యకర్తల్లో అహంకారం రావొద్దని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పకడ్బందీ ప్రణాళికతో అంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కుల, మతాలకు అతీతంగా తెరాసకే ఓటు వేశారన్నారు. కేసీఆర్‌ తమ పెద్ద కుమారుడని వృద్ధులు అండగా నిలిచారని చెప్పారు. రాబోయే ఆర్నెల్లలో దేవాదుల ద్వారా జనగామలోని ప్రతి చెరువునూ నింపుతామన్నారు.ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ అని అన్నారు. తెరాస పుట్టుకే ఒక చరిత్ర అన్నారు. ఉద్యమాలకు గుండెకాయలాంటి వరంగల్‌ నుంచే తాను పర్యటన ప్రారంభిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుంచి పక్కకు తొలగితే రాళ్లతో కొట్టమని చెప్పిన నేత కేసీఆర్‌ అని కొనియాడారు. తెలంగాణ ఎందుకివ్వరంటూ అలుపెరుగని ఉద్యమం సాగించారన్నారు. ఆమరణ దీక్ష చేసి తెలంగాణను సాధించిన ధీరోదాత్తుడు కేసీఆర్‌ అని కొనియాడారు. ఎత్తిన గులాబీ జెండా దించకుండా 14 ఏళ్లు పోరాటం చేసిన కార్యకర్తలకు అండగా నిలవడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. కార్యకర్తలకు మేం ఉన్నామనే భరోసా ఇవ్వాలని కేసీఆర్‌ తనకు పార్టీ బాధ్యతలు అప్పగించారన్నారు. గురువారం జనగామ జిల్లాలో కేటీఆర్‌ పర్యటించారు. తొలుత పెంబర్తి నుంచి జనగామ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. మెజార్టీ రాగానే ప్రజలు, కార్యకర్తలు తేలికగా తీసుకోవద్దని కేసీఆర్‌ చెబుతుంటారని, గెలుపులో పాఠాలు.. ఓటమిలో గుణపాఠం ఉంటాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో తెరాస విజయబావుటా ఎగురవేసే బాధ్యత గెలిచిన తమపై ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నేతలు ఏడెనిమిది నెలలు శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తెరాసను దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా బలోపేతం చేసుకునే అవకాశం ఉందన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో నేలవిడిచి సాము చేయకుండా పార్టీ నేతలు కథానాయకులై కదిలారని, స్వగ్రామం దాటకుండా అందరూ సమష్టిగా పనిచేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధించగలిగామని చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికలు, 16 లోక్‌సభ స్థానాల్లో తెరాస గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలే కేంద్రంలో ఎవరు గద్దెనెక్కాలో నిర్ణయించాలని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ తెరాస కార్యాలయాలు నిర్మాణం చేపడతామని, అవసరమైతే నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని చెప్పారు. కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా పార్టీ కార్యాలయానికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందనే భరోసా ఇవ్వడానికే ఆ దిశగా ఆలోచిస్తున్నామన్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకు పనిచేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందించేలా క్షేత్రస్థాయి వరకు పార్టీ నిర్మాణం జరగాలన్నారు. మంత్రులు కూడా జిల్లా పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌ సమీపంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు  చేయనున్నట్టు తెలిపారు. ప్రజలు తెరాసకు సానుకూలంగా ఉన్నారని, కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.  కాంగ్రెస్‌, భాజపా వైపు తెలంగాణ ప్రజలు చూడటంలేదన్నారు. రానున్న ఎన్నికల్లో స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించుకొని సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Related Posts