YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉత్తమ్ కు పదవీ గండం.. ?

ఉత్తమ్ కు పదవీ గండం.. ?
ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రజాకూటమిలో భవిష్యత్‌ కార్యా చరణపై చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే జిల్లాల్లో కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'ప్రజాకూటమి ఓడినా.. గెలిచినా పూర్తి బాధ్యత తనదే'నన్న ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్‌గా కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతున్నది. అయితే తనకు సీఎల్‌పీ ఇవ్వాలని అధిష్టానా న్ని ఉత్తమ్‌ కోరుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పీసీసీ ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నట్టు సమాచారం. అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రేవంత్‌రెడ్డిని ఎంపికచేసే ఆలోచన ఉన్నట్టు తెలిసింది. సీఎల్‌పీగా సీనియర్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు ఇస్తే అన్నివిధాలా సముచితంగా ఉంటుందనీ, అసెంబ్లీలో, బయట కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో పోరాడగలదనీ భావిస్తున్నట్టు పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఇదే జరిగితే ఉత్తమ్‌ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు పీసీసీ హోదాలో ఉండి, ఇప్పుడు కనీసం సీఎల్‌పీ కూడా లేకపోతే ఎలా అని ఆయన అనుచరణ గణం ఆందోళనకు గురవుతున్నది. మరోపక్క ప్రత్యర్థి శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గంలో ఉంటూ తానే ప్రభుత్వం తరపున అన్నీ చేస్తాననీ, ఉత్తమ్‌ ఉంటే అసెంబ్లీలో ఉండాలి, లేకుంటే హుజూర్‌నగర్‌లో ఉండాలనీ సవాల్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి రీత్యా ఉత్తమ్‌ భవితవ్యం ఎటు తేలనుందో కొద్దికాలం వేచి చూడాల్సిందే..పీసీసీ గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గానీ, రేవంత్‌రెడ్డి గానీ, సీఎల్‌పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కకు ఇస్తే సామాజికం గా అన్నివిధాలా కలిసొస్తుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్టు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు రావడంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కాంగ్రెస్‌ జతకట్టింది. వారి సీట్ల పంపకం నామినేషన్ల చివరి వరకూ తెగలేదు. చివరకు ఎలాగోలా సర్దుకున్నా.. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ కూటమి అన్ని నియోజకవర్గాల్లో వెనుక బడింది. సోనియా, రాహుల్‌, చంద్రబాబు పర్యటనలు, సభలు తప్ప పీసీసీ హోదాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడా ప్రచార సభలు జరపలేదనేది వాస్తవం. కేసీఆర్‌ తన చతురతతో దరిదాపు ప్రతీ నియోజకవర్గాన్ని టచ్‌ చేశారు. ప్రభుత్వ పథకాలు, కేసీఆర్‌ మాటలకు ప్రజలు ఊహించని రీతిలో తిరిగి పట్టం కట్టారు. అయితే కేసీఆర్‌ మంత్రి వర్గం ఏర్పాటు చేయకుండా టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకురావాలనీ, అసలు సీఎల్‌పీ లేకుండా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను నడిపించగల సమర్థుడు, శాసనసభలో తమ బాణీ గట్టిగా వినిపించగల నాయకుడి వేటలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకత్వం తమదే అన్నట్టు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య గెలవడం, అద్దంకి దయాకర్‌, వెంకటరెడ్డి ఓడిపోయినా పైచేయి తమదే అన్నట్టు వారున్నారు. 

Related Posts